Last Updated:
బాలీవుడ్ మెగాస్టార్, ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఏముందో చూద్దామా..
బాలీవుడ్ మెగాస్టార్, ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో, ముఖ్యంగా తన వ్యక్తిగత బ్లాగ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన దైనందిన జీవిత విశేషాలతో పాటు, సమాజం, జీవిత తత్వాలకు సంబంధించిన ఎన్నో లోతైన విషయాలను ఆయన తన అభిమానులతో తరచుగా పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఆయన తన బ్లాగ్‌లో చేసిన ఒక తాత్విక పోస్ట్ ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ కుటుంబంలో, ముఖ్యంగా ఆయన నివాసం ‘జల్సా’ కు సంబంధించి ఆస్తి వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తన బ్లాగ్‌లో జీవితం, సంపద, మానవ నైజం గురించి అమితాబ్ చాలా లోతైన విశ్లేషణ చేశారు. “మనిషి దగ్గర ఏమీ లేనప్పుడు, ఏదైనా సాధించాలి, పొందాలి అని నిరంతరం ఆరాటపడుతూనే ఉంటాడు. కనీసం ఏదో ఒకటి దొరికినా చాలు అని దేవుడిని వేడుకుంటాడు. కానీ, భగవంతుడి దయ వల్ల, అదృష్టం వరించి కోరుకున్నదానికంటే అన్నీ సమృద్ధిగా లభించినప్పుడు మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. దేవుడు అడగకుండానే ఇన్ని ఇచ్చేశాడేంటి? ఇంత సంపదను, వీటన్నింటినీ ఇప్పుడు నేనేం చేయాలి? అని ఆలోచనలో పడతాడు. ఇదే జీవితంలో అతిపెద్ద సత్యం” అని బిగ్ బి రాసుకొచ్చారు. దేవుడిని మనం అడుగుతాం కానీ, ఆయన మన ఊహకు మించి ఇస్తాడంటూ జీవిత సత్యాలను పంచుకున్నారు.
ఇంతటితో ఆగకుండా ప్రపంచ తీరుపై కూడా అమితాబ్ చమత్కరించారు. “ఈ ప్రపంచం మనం చెప్పినట్లుగా ఎప్పటికీ నడవదు. ప్రపంచం పరుగులు పెడుతున్నప్పుడు, మనం కూడా దానితో పాటే పరుగెత్తి అందుకోగలిగితే అది మనకు మంచిది. ఒకవేళ ఆ పరుగులో మనం వెనుకబడితే, ఎప్పటికీ వెనకే ఉండిపోతాం” అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. అయితే ఆయన ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారన్నది ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్. ఈ వేదాంత ధోరణి పోస్ట్ పరోక్షంగా తన ఇంట్లో జరుగుతున్న ఆస్తి గొడవలను ఉద్దేశించినదేనని నెటిజన్లు భావిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్ ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న తన ఐకానిక్ బంగ్లా ‘జల్సా’లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రతి ఆదివారం వేలాది మంది అభిమానులు ఆ ఇంటి ముందే ఆయన కోసం వేచి చూస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ఇల్లు ఆస్తి వివాదంలో చిక్కుకుంది. అమితాబ్ సోదరుడు అజితాబ్ బచ్చన్ భార్య రమోలా బచ్చన్.. జల్సా యాజమాన్య హక్కులపై సవాల్ చేస్తున్నారు. 1993లో ఈ ఇంటిని అమితాబ్ సతీమణి జయా బచ్చన్ పేరు మీదకు గిఫ్ట్ డీడ్ (బహుమతి) కింద బదిలీ చేశారు. అయితే, ఆ గిఫ్ట్ డీడ్ కంటే ముందు ఆ ఆస్తి తన పేరు మీదే ఉందని రమోలా ఆరోపిస్తున్నారు. ఈ లావాదేవీ, బదిలీ గురించి తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, తన అనుమతి లేకుండానే ఈ ఇంటిని గిఫ్ట్ డీడ్ కింద తమ సొంతం చేసుకున్నారని ఆమె న్యాయపరంగా పోరాడుతున్నట్లు సమాచారం. ఈ వివాదం రోజురోజుకూ ముదురుతున్న వేళ బిగ్ బి బ్లాగ్ పోస్ట్ వైరల్ గా మారింది.

