Last Updated:
రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న వ్యక్తులను మరింతగా విమర్శించడం, దూషించడం సరైన పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న వ్యక్తులను మరింతగా విమర్శించడం, దూషించడం సరైన పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రతి ఒక్కరినీ మనుషులుగానే చూడాలని, ఎదుటివారి బాధను అర్థం చేసుకోవాలని సూచించారు. అయితే ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి రాశారనే విషయంపై మాత్రం ఆమె ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్పందిస్తూ.. ఇప్పటికే కిందపడిపోయిన వ్యక్తిని మళ్లీ తొక్కడం అమానవీయమైన చర్య అని పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా అతనికి కూడా భావోద్వేగాలు ఉంటాయని గుర్తు చేశారు. ఇతరుల జీవితాల్లోని సమస్యలను, తప్పులను వేలెత్తి చూపించే ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలని పరోక్షంగా సూచించారు.
ఈ సందర్భంగా ఆమె ఓ ఆసక్తికరమైన ఉదాహరణను కూడా ప్రస్తావించారు. ‘మనం అద్దాల ఇంటిలో ఉంటూ ఇతరుల ఇళ్లపై రాళ్లు విసరకూడదు’ అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని సమస్యలు, లోపాలు ఉంటాయని.. అలాంటప్పుడు ఇతరులను విమర్శించే ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని మరింతగా అవమానించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు.
అయితే రేణు దేశాయ్ ఈ పోస్ట్ పెట్టగానే సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు మొదలయ్యే అవకాశం ఉందని ఆమె ముందుగానే ఊహించినట్లు కనిపిస్తోంది. తన వ్యాఖ్యలను చూసి ఎవరినో ఉద్దేశించి రాశారంటూ ఊహాగానాలు చేయవద్దని స్పష్టం చేశారు. ఈ పోస్ట్ వెనుక ప్రత్యేకంగా ఎవరూ లేరని, సమాజం మరింత సున్నితంగా, బాధ్యతాయుతంగా ఉండాలనే ఉద్దేశంతోనే తన అభిప్రాయాన్ని పంచుకున్నట్లు వెల్లడించారు.
అంతేకాదు.. తాను సున్నితమైన మనస్తత్వంతో స్పందించినందుకు ఎలాంటి ప్రయోజనం పొందలేదని, ‘నేను సెన్సిబుల్‌గా ఉన్నందుకు పేటీఎంలో ఏమీ రాలేదు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మాటల ద్వారా తన పోస్ట్‌ను వ్యక్తిగత కోణంలో చూడవద్దని చెప్పే ప్రయత్నం చేశారు.
ఇటీవల రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు తరచూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా సమాజంలో జరిగే కొన్ని విషయాలపై ఆమె తన అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేస్తుంటారు. తాజాగా చేసిన ఈ పోస్ట్ కూడా అలాంటి చర్చకు కారణమవుతోంది. అయితే ఆమె ఎవరినీ ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడంతో, ఈ వ్యాఖ్యలను సాధారణ సామాజిక సందేశంగానే చూడాల్సి ఉంటుంది. మొత్తానికి.. ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు అతడిని మరింతగా విమర్శించడం కంటే, ఆ పరిస్థితిని అర్థం చేసుకుని మానవత్వంతో వ్యవహరించడం ముఖ్యమనే సందేశాన్ని రేణు దేశాయ్ తన పోస్ట్ ద్వారా అందించారు.

