Last Updated:
Cancer Medicine Price: క్యాన్సర్ మందులు కొనుగోలు చేసేవారికి ముఖ్యమైన అలర్ట్. నవంబర్ 9 నుంచి దేశవ్యాప్తంగా పలు క్యాన్సర్ ఔషధాల కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని NPPA తీసుకున్న నిర్ణయంతో కొన్ని బ్రాండ్ల మందుల ధరలు దాదాపు 96 శాతం తగ్గాయి. దీంతో రోగులకు భారీగా డబ్బు ఆదా కానుంది. ఏ మందుల ధరలు తగ్గాయి? మెడికల్ షాపుల్లో కొత్త ధరలను ఎలా చెక్ చేసుకోవాలి?
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న రోగులు, వారి కుటుంబాలకు భారీ ఊరట అని చెప్పుకోవాలి. ఖరీదైన క్యాన్సర్ మందుల ధరలను భారీగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై ఈ మందుల కొనుగోలు కోసం వేల రూపాయలు ఖర్చు చేసే అవసరం తగ్గనుంది. కొన్ని బ్రాండ్ల ఔషధాల ధరలు ఏకంగా 96.45 శాతం వరకు తగ్గడం విశేషం. ఈ ఒక్క నిర్ణయంతో దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఏడాదికి సుమారు రూ.3,540 కోట్ల మేర డబ్బు ఆదా కానుంది. ఈరోజు నుంచి (నవంబర్ 9), 2026 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.
రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 137 క్యాన్సర్ నిరోధక ఔషధాల గరిష్ట రిటైల్ ధరలపై వాణిజ్య మార్జిన్లను పరిమితం చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ చర్య చేపట్టింది.
2026 నవంబర్ 8 నాటికి 85 ఫార్మాస్యూటికల్ కంపెనీలు 121 రకాల క్యాన్సర్ మందులకు సంబంధించి 1,364 ఫార్ములేషన్ల సవరించిన ధరలను ప్రకటించాయి. వీటిలో 679 బ్రాండ్ల మందుల ధరలు 50 శాతానికి పైగా తగ్గాయి. గరిష్టంగా కొన్ని ఔషధాల ధరలు 96.45 శాతం వరకు తగ్గాయి. దీంతో గతంలో ఒక మందు కొనుగోలుకు భారీ మొత్తం చెల్లించాల్సి వచ్చిన రోగులకు ఇప్పుడు గణనీయంగా ఖర్చు తగ్గనుంది.
క్యాన్సర్ చికిత్సలో మందుల ఖర్చు కుటుంబాలకు పెద్ద ఆర్థిక భారంగా ఉంటుంది. నెలల తరబడి చికిత్స తీసుకోవాల్సి రావడం, ఖరీదైన ఔషధాలను తరచూ కొనుగోలు చేయాల్సి రావడంతో పొదుపు చేసిన డబ్బు కూడా ఖర్చవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది కుటుంబాలకు ఉపయోగపడనుంది. NPPA అంచనా ప్రకారం మందుల ధరల తగ్గింపుతో వినియోగదారులకు ఏడాదికి సుమారు రూ.3,540.38 కోట్ల మేర ఆదా అవుతుంది.
వినియోగదారులు మందుల ప్యాకెట్లపై ముద్రించిన కొత్త MRPని పరిశీలించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వ ‘ఫార్మా సహీ దామ్’ మొబైల్ యాప్ ద్వారా కూడా ఔషధాల ధరలను తెలుసుకోవచ్చు. NPPA అధికారిక వెబ్సైట్ nppa.gov.inలోనూ సవరించిన ధరల వివరాలు అందుబాటులో ఉంటాయి. కొత్త ధరలు అమల్లోకి వచ్చిన తర్వాత మెడికల్ షాపులు, ఆసుపత్రుల ఫార్మసీలు నిర్ణయించిన MRP కంటే ఎక్కువ ధర వసూలు చేయకూడదు. ఎవరైనా ఎక్కువ ధరకు మందులు విక్రయిస్తే ‘ఫార్మా జన్ సమాధాన్’ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా NPPA హెల్ప్‌లైన్ 1800-111-255కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. కాబట్టి క్యాన్సర్ మందులు కొనుగోలు చేసేటప్పుడు పాత ధరలకు బదులుగా సవరించిన MRPని తప్పనిసరిగా తనిఖీ చేయాలి.

