Last Updated:
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్న యువ నటుడు వివేక్ చేపూరి ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్న యువ నటుడు వివేక్ చేపూరి. ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంలో రవి అనే పాత్రతో అందరినీ తన విలనిజంతో మెప్పించాడు. 2019లో వచ్చిన ఆ చిత్రంలో విశ్వక్ సేన్‌కి ధీటుగా వివేక్ చేపూరి కనిపించాడు. ఇక ఇప్పుడు ఏడేళ్ల తర్వాత మళ్లీ విశ్వక్ సేన్ దర్శకత్వంలో ‘కల్ట్’ అనే చిత్రంలో వివేక్ చేపూరి తన మార్క్ క్రియేట్ చేశాడు. ‘కల్ట్’ చిత్రంలో ఇషాన్ పాత్రలో అందరినీ భయపెట్టేశాడు వివేక్ చేపూరి.
‘కల్ట్’ చిత్రంలో ఇషాన్ పాత్రకి, వివేక్ నటనకు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రకరకాల ఎడిట్స్‌తో రీల్స్ వైరల్ అవుతున్నాయి. వివేక్ సైతం ఆడియెన్స్ చూపిస్తున్న ఈ ప్రేమకు ఎంతగానో మురిసిపోతోన్నాడు. ఇక అలాంటి వివేక్ త్వరలోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. టి. శరత్ చంద్ర దర్శకత్వంలో తెలుగు, తమిళంలో ద్విభాష చిత్రంగా రూపు దిద్దుకుంటోంది. ఈ సినిమాకి ప్రియేష్ గురుస్వామి కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్, టీజర్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.
ఇక ‘కల్ట్’ సినిమా విషయానికొస్తే.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈసారి నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన సత్తా చాటేందుకు ‘కల్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా హారర్, క్రైమ్, యాక్షన్ అంశాలతో కూడిన విభిన్నమైన కథను ఎంచుకున్నారు. ముఖ్యంగా విపరీతమైన హింస, రక్తపాతం, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ సినిమాను రూపొందించారు.
గోవాలోని ఓ మారుమూల ప్రాంతంలో జరిగే పార్టీకి కొంతమంది యువతీ యువకులు వెళ్తారు. అక్కడ అంతా సరదాగా సాగుతుందనుకునే సమయంలో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. ముసుగులు ధరించిన కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చిన యువతీ యువకులను లక్ష్యంగా చేసుకుంటారు. ప్రాణాలతో బయటపడాలంటే కొన్ని ప్రమాదకరమైన ఆటల్లో పాల్గొనాలని షరతు విధిస్తారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారుతుంది. మరోవైపు డీఎస్పీ సంకల్ప్ నాయక్‌గా రంగంలోకి దిగిన విశ్వక్ సేన్.. అక్కడ జరుగుతున్న వరుస హత్యల వెనుక ఉన్న రహస్యాలను ఛేదించే ప్రయత్నం చేస్తాడు. అసలు ఈ ఆటను నడిపిస్తున్నదెవరు? దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నవారు ఎలా బయటపడ్డారు? అనేది సినిమా కథ.

