Last Updated:
అగ్నిపథ్ పథకంలో కేంద్ర ప్రభుత్వం చారిత్రక మార్పులు చేపట్టింది. నాలుగేళ్ల గడువు ముగిసిన తర్వాత బయటకు వెళ్లాల్సిన 75 శాతం అగ్నివీరుల సర్వీసును మరో రెండేళ్లపాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ కీలక ఆమోదం తెలిపింది.
భారత సాయుధ దళాల నియామక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన విధానపరమైన నిర్ణయం తీసుకుంది. 2022లో ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం నిబంధనల ప్రకారం నాలుగేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత త్రివిధ దళాల నుంచి వైదొలగాల్సిన 75 శాతం అగ్నివీరులకు మరో రెండేళ్ల పాటు సర్వీసును పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ చారిత్రక నిర్ణయాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి బుధవారం న్యూఢిల్లీలో అధికారికంగా ప్రకటించారు. అగ్నివీరులకు, దేశ రక్షణ రంగానికి ఇదొక ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని ఆయన అభివర్ణించారు.
ఈ పొడిగించిన రెండేళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత సైనిక ఎంపిక నిబంధనలకు అనుగుణంగా అర్హత సాధించిన వారందరినీ రెగ్యులర్ సైనికులుగా శాశ్వత సర్వీసులోకి తీసుకునే సరికొత్త మార్గాన్ని ప్రభుత్వం కల్పించిందని సీడీఎస్ వెల్లడించారు. సైన్యంలో పనిచేస్తున్న అగ్నివీరుల పనితీరుపై అత్యుత్తమ స్పందన వచ్చిందని స్పష్టం చేశారు.
పాత విధానం ప్రకారం ప్రతి బ్యాచ్లో కేవలం 25 శాతం మందిని మాత్రమే శాశ్వత సైనికులుగా తీసుకుని మిగిలిన 75 శాతం మందిని రిలీవ్ చేసేవారు. తాజా నిర్ణయంతో బయటకు వెళ్లాల్సిన మిగిలిన 75 శాతం మందికి రెండవ విడత కింద అదనంగా రెండేళ్ల పాటు దేశ సేవ చేసే సువర్ణావకాశం లభించింది. ఈ పొడిగించిన కాలంలో అగ్నివీరులకు ప్రస్తుత వేతనం కన్నా అధిక వేతనంతో పాటు సేవా నిధి ప్యాకేజీని కూడా గణనీయంగా పెంచనున్నారు.
2022లో తొలి విడతలో దాదాపు 24,400 మంది యువత అగ్నివీరులుగా ఎంపికయ్యారు. వీరి నాలుగేళ్ల ప్రాథమిక పదవీకాలం త్వరలోనే ముగియనుంది. నౌకాదళం మొదటి బ్యాచ్ నవంబర్ 21న, వైమానిక దళం డిసెంబర్ 21న, సైన్యం మొదటి బ్యాచ్ డిసెంబర్ 31తో తమ ప్రాథమిక సర్వీసును పూర్తి చేసుకోనున్నాయి.
ఇప్పటికే వైమానిక దళం మొదటి బ్యాచ్ నుంచి 712 మందిని, నౌకాదళం 550 మందిని శాశ్వత సైనికులుగా అధికారికంగా ఖరారు చేశాయి. కేంద్ర తాజా నిర్ణయం వల్ల బలగాల్లో మూడు విభాగాలు ఏర్పడనున్నాయి. సాధారణ నాలుగేళ్ల కాలం పూర్తి చేసుకునేవారు, రెండేళ్ల పొడిగింపు పొందే అగ్నివీరులు, శాశ్వత కేడర్లో చేరిన సైనికులుగా వీరు సేవలందిస్తారు. వేలాది మంది సైనిక ఔత్సాహికులకు ఈ నిర్ణయం కొండంత భరోసానిచ్చింది.

