Last Updated:
గల్ఫ్ ఉద్రిక్తతల వేళ ఎరువులు, గ్యాస్ కొరత ఉందంటూ విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. రైతులను భయపెట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే వారి కుట్రని గుజరాత్ సభలో ధ్వజమెత్తారు.
పశ్చిమాసియా సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని దేశంలో ఎరువులు, గ్యాస్ కొరత ఉందంటూ ప్రతిపక్షాలు పనిగట్టుకుని పుకార్లు వ్యాప్తి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుజరాత్‌లోని బనస్కాంతలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశం ఇబ్బందుల్లో ఉంటే చూసి ఆనందించే మనస్తత్వం విపక్షాలదని ఎద్దేవా చేశారు. గల్ఫ్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, ఆ భారాన్ని రైతులపై పడనివ్వకుండా కేంద్ర ప్రభుత్వమే భరించిందని స్పష్టం చేశారు.
రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. తాజాగా పీఎం-కిసాన్ నిధులను సైతం నేరుగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. విపక్షాలు రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతీయ సంస్కృతిలో వ్యవసాయం ప్రధాన భాగమని, అందుకే సాగు రంగంతో పాటు పాడి పరిశ్రమను అత్యాధునిక సాంకేతికతతో అనుసంధానించామని ప్రధాని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు 26 కోట్లకు పైగా సాయిల్ హెల్త్ కార్డులు అందజేశామని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే పాడి రంగంలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని, గత పదేళ్లలో సైన్స్, టెక్నాలజీ ద్వారా డెయిరీ రంగాన్ని బలోపేతం చేశామని వివరించారు.
రాజకీయాల్లో ప్రజాసేవకు అంకితమై 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ప్రజలు తనపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలు మరువలేనివని భావోద్వేగానికి గురయ్యారు. సభకు వచ్చిన ప్రజలంతా సంప్రదాయ మంచాలపై కూర్చోవడం గ్రామ జీవన సంస్కృతికి నిదర్శనమని, ఇది గిన్నిస్ రికార్డుకు అర్హమని చమత్కరించారు.
ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ (సబర్మతి)-వారణాసి ఎక్స్‌ప్రెస్, మెహసానా-బెచరాజీ-సబర్మతి మెము రైలు సర్వీసులను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమాసియా పరిణామాలను ఐక్యంగా ఎదుర్కొంటున్న వేళ పుకార్లు నమ్మవద్దని పిలుపునిచ్చారు.

