Last Updated:
క్వాడ్ సదస్సులో పాల్గొనడానికి వాషింగ్టన్ ‘ఉత్సాహంగా’ ఉందని అమెరికా అగ్రశ్రేణి దౌత్యవేత్త అన్నారు.
అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్ సమ్మిట్ ఈ ఏడాది చివరలో జరిగే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. అయితే తేదీలపై ఇంకా ఎలాంటి నిర్దిష్ట చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.
నెట్వర్క్18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషితో జరిగిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో క్వాడ్ సమ్మిట్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన గురించి అడిగినప్పుడు రూబియో స్పందించారు. “ఈ ఏడాది ముగిసేలోపు క్వాడ్ సమ్మిట్ జరుగుతుందని ఆశిస్తున్నాం. దీని నిర్వహణపై ఒక అంగీకారానికి వచ్చాం. ఆసియాన్ సదస్సులో భాగంగా మనీలాలో దీన్ని నిర్వహించబోతున్నాం. నిర్దిష్ట తేదీ ఇంకా ఖరారు కాలేదు, కానీ సదస్సు కచ్చితంగా జరుగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వాషింగ్టన్ “ఉత్సాహంగా” ఉందని ఈ అగ్రశ్రేణి అమెరికన్ దౌత్యవేత్త తెలిపారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి హోదాలో తాను పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.
“అప్పటి నుంచి మన మధ్య ఏడెనిమిది దఫాలుగా చర్చలు జరిగాయని నేను భావిస్తున్నాను. అట్లాంటాలో జరిగే జీ20 సదస్సులో మరోసారి సమావేశం కాబోతున్నాం. కొన్ని వారాల్లో ఆసియా వేదికగా జరిగే లీడర్స్ లెవల్ మీటింగ్‌లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం” అని ఆయన చెప్పారు. అయితే ట్రంప్ భారత పర్యటన గురించి ఆయన స్పష్టంగా ప్రస్తావించలేదు.
వాస్తవానికి 2025లో భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సిన క్వాడ్ లీడర్స్ సమ్మిట్ వాయిదా పడుతూ వస్తోంది. నాలుగు సభ్య దేశాలు ఇప్పటికీ వార్షిక సమావేశాన్ని నిర్వహించలేదు. చివరిసారిగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో 2024 సెప్టెంబర్ 21న డెలావేర్‌లోని విల్మింగ్టన్లో క్వాడ్ సమ్మిట్ జరిగింది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి, స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఆయా దేశాలు ప్రయత్నిస్తున్న వేళ క్వాడ్ ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతోంది. ఇరాన్ వివాదం, అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది క్వాడ్ చర్చలు భౌగోళిక రాజకీయపరంగా మరింత ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి.
అయితే ట్రంప్ రెండో దఫా అధ్యక్ష పాలన క్వాడ్‌పై పలు రకాలుగా ప్రభావం చూపింది. మిత్రదేశాలతో వాణిజ్య ఉద్రిక్తతలు, టారిఫ్‌లపై ఘర్షణ, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిపై భేదాభిప్రాయాలు, లావాదేవీల ఆధారిత ఫలితాలపై ఎక్కువ దృష్టి పెట్టడం లాంటివి ఇందులో ఉన్నాయి. రష్యా చమురు కొనుగోళ్ల నేపథ్యంలో భారతీయ వస్తువులపై ట్రంప్ భారీ సుంకాలు విధించడంతో భారత్-అమెరికా సంబంధాలు కూడా ఉద్రిక్తంగా మారాయి.

