Last Updated:
Defence Secrets: కృత్రిమ మేధస్సు (AI) సాధనాలను ఉపయోగించి భారత రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని సేకరించి, విదేశీ నిఘా వర్గాలకు చేరవేస్తున్నారనే తీవ్ర ఆరోపణలపై తెలంగాణకు చెందిన ఓ మహిళపై జమ్మూ కశ్మీర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సికింద్రాబాద్‌కు చెందిన ఈ మహిళ, భారత సైన్యంలో మేజర్ హోదాలో పనిచేస్తున్న అధికారితో వివాహం చేసుకుని జమ్మూ కశ్మీర్లో నివసిస్తున్నారు. జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా విశ్లేషణాత్మక పరిశోధనా పత్రాల ముసుగులో ఆమె గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించామని, అనంతరం అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారం ఆధారంగా, ఈ నెల 14న ఆమె పఠాన్‌కోట్ వెళ్లేందుకు జమ్మూతావి రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే భద్రతా దళాలు ఆమెను అదుపులోకి తీసుకున్నాయి. వెంటనే ఆమెను సమీపంలోని సైనిక స్థావరానికి తరలించి విచారించారు. ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌తో పాటు ఇతర డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతం గాంధీ నగర్ పోలీస్ స్టేషన్లో అధికార రహస్యాల చట్టం (Official Secrets Act) తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని గూఢచర్యం, నేరపూరిత కుట్ర, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ హైప్రొఫైల్ కేసు సమగ్ర విచారణ బాధ్యతలను డీఎస్పీ స్థాయి అధికారికి అప్పగించారు.
ఆమె మొబైల్ ఫోన్‌ను ప్రాథమికంగా పరిశీలించగా విస్మయపరిచే అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారత్-ఇటలీ రక్షణ సంబంధాలపై మాణెక్ షా సెంటర్లో జరిగిన సమావేశ వివరాలు, భారత సైన్యాధిపతి అమెరికా పర్యటన కార్యాచరణ, భారత్-రష్యా రక్షణ ఒప్పందాలు, సైనిక వ్యూహమైన ‘కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్’ పత్రాలు ఆమె వద్ద లభించాయి. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్‌లోని వ్యూహాత్మక కలై-2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, కమలా ప్రాజెక్టులతో పాటు అస్సాం ప్రాజెక్టులు, భారత్-చైనా సరిహద్దు సంబంధాలపై ఉన్న క్లిష్టమైన సమాచారం ఆమె ఫోన్లో నిక్షిప్తమై ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
నిందితురాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో ఉన్నత విద్యావంతురాలు. 2021లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ, 2022లో జెనీవాలో మాస్టర్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ పూర్తి చేశారు. దిల్లీలోని సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్‌లో ఇంటర్న్‌షిప్ చేయడంతో పాటు పలు వ్యాసాలు రాశారు. 2023లో ఐక్యరాజ్యసమితి (ఐరాస) లో ఐటీ ఇంటర్న్‌షిప్ చేసిన సమయంలో చైనా జాతీయులతో సహా పలువురు విదేశీయులతో ఆమె వాట్సప్ సంభాషణలు జరిపినట్లు వెల్లడైంది. 2024లో మలేసియాలో కన్సల్టెన్సీ నడుపుతున్న కొందరు వ్యక్తులతోనూ ఆమె నిరంతరం సంప్రదింపులు జరిపారని, ఆ వ్యక్తులు చైనా నిఘా విభాగాలకు అనుబంధంగా పనిచేస్తున్నారని దర్యాప్తులో బయటపడింది.
విచారణలో తాను చాట్‌జీపీటీ, ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ వంటి బహిరంగ ఏఐ టూల్స్ ద్వారా లభించే సమాచారాన్నే సేకరించానని చెప్పినప్పటికీ, బహిరంగ డేటాతో పాటు అంతర్గత సైనిక సమాచారాన్ని జోడించి విశ్లేషణ పత్రాలు రూపొందించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఫ్రీలాన్స్ రీసెర్చర్ ముసుగులో ఆమె ద్వారా ఎంత మొత్తం సమాచారం శత్రుదేశాల చేతుల్లోకి వెళ్లింది? ఆమె జరిపిన ఆర్థిక లావాదేవీలు ఏమిటి? అన్న కోణాల్లో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

