డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. యువత భవిష్యత్తుకు రక్షణ కవచం!
ఖమ్మం జిల్లాను మత్తు పదార్థాల రహితంగా మార్చేందుకు సమగ్ర కార్యాచరణ ! జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్
55 కేసులు నమోదు.. 137 మంది అరెస్ట్ | విద్యాసంస్థల్లో 57 అవగాహన సదస్సులు
ఖమ్మం, ప్రభ న్యూస్,అక్టోబర్ 17 :
ఖమ్మం జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత చర్యలకు సిద్ధమైంది. యువత, విద్యార్థుల భవిష్యత్తును మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటంతో పాటు, జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యంగా పటిష్ట నిఘా, నిరంతర తనిఖీలు, శాఖల మధ్య సమన్వయంతో కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎన్కార్డ్ (ఎన్సీఓఆర్డీ) కమిటీ సమీక్షా సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపడుతున్న చర్యలు, సాధించిన పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం యువత విద్యాభ్యాసం, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు అలవాటుపడటం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు సమాజంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని, ఈ సమస్యను సమష్టి కృషితో అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు గంజాయి, ఇతర డ్రగ్స్‌కు సంబంధించి 55 కేసులు నమోదు చేసి, 137 మంది నిందితులను అరెస్టు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు మార్గాలతో పాటు అంతర్రాష్ట్ర రవాణా మార్గాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల సరఫరా వెనుక ఉన్న మూలాలను గుర్తించడంతో పాటు సరఫరాదారులు, విక్రయదారులు, కొనుగోలుదారులపై సమగ్ర విచారణ చేపట్టి, ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మెడికల్ కళాశాల పరిసరాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించాలని, పాఠశాలల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలపై నిఘా పెంచి, అనుమానాస్పద కార్యకలాపాలపై తరచూ తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు.
విద్యాసంస్థల్లో అవగాహన.. యాంటీ డ్రగ్ క్లబ్‌లు తప్పనిసరి
విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా జిల్లాలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఇప్పటివరకు 57 అవగాహన సదస్సులు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ క్లబ్‌లను ఏర్పాటు చేసి సమర్థంగా నిర్వహించాలని, ఉన్నత పాఠశాలల నుంచి కళాశాలల వరకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు, యువత వాటికి ఆకర్షితులు కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అక్రమంగా మందుల విక్రయిస్తే కఠిన చర్యలు
మాదకద్రవ్యాల బారిన పడిన వారికి సకాలంలో కౌన్సెలింగ్, వైద్య చికిత్స, పునరావాస సేవలు అందించేందుకు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ప్రత్యేక డీ-అడిక్షన్ సేవలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా నియంత్రిత మత్తు మందులు, ఇతర ప్రిస్క్రిప్షన్ ఔషధాలను విక్రయించే మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, మాదకద్రవ్యాల నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
డ్రగ్స్ రహిత ఖమ్మం కోసం ప్రజల సహకారం కీలకం
ఖమ్మం జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, యువత పూర్తిస్థాయిలో సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల అక్రమ విక్రయాలు, రవాణాకు సంబంధించిన సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1908కు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్ పారస్ కుమార్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎం. ఫిరంగి, జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు దేవేందర్‌రెడ్డి, అనిల్, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. వీరన్న, పోలీస్ ఇన్స్పెక్టర్ వి. విజయ రాంకుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


