Last Updated:
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటుకున్నారు. పోయిన చోరీకి గురైన మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు అందించడంలో 76.8 శాతం రికవరీ రేటు సాధించి తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మూడో సంవత్సరం కూడా ప్రథమ స్థానంలో నిలిచారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటుకున్నారు. పోయిన చోరీకి గురైన మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు అందించడంలో 76.8 శాతం రికవరీ రేటు సాధించి తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మూడో సంవత్సరం కూడా ప్రథమ స్థానంలో నిలిచారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం, పోలీసు సిబ్బంది నిరంతర పర్యవేక్షణ, వేగవంతమైన దర్యాప్తు కారణంగానే ఈ ఘనత సాధ్యమైందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే తెలిపారు.
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌ఫోన్ రికవరీ మేళాలో గత కొంతకాలంగా పోయిన లేదా చోరీకి గురైన సుమారు రూ.13 లక్షల విలువైన 90 మొబైల్ ఫోన్లను వాటి యజమానులకు తిరిగి అందజేశారు. ఈ ఫోన్లు కేవలం తెలంగాణలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి సీఈఐఆర్ (CEIR) సాంకేతిక వ్యవస్థ సహాయంతో గుర్తించి రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్పీ మహేష్ బి. గీతే, ప్రస్తుతం ప్రతి వ్యక్తి జీవితంలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైన సాధనంగా మారిందన్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు, యూపీఐ యాప్‌లు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత ఫొటోలు, ముఖ్యమైన పత్రాలు వంటి విలువైన సమాచారం మొబైల్‌లోనే నిల్వ ఉంటోందని చెప్పారు. ఇదే విషయాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు మొబైల్ ఫోన్లను దొంగిలించి, బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఛేదించి ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా డబ్బులు కాజేస్తున్నారని హెచ్చరించారు.
అందువల్ల మొబైల్ ఫోన్ పోయిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌లో ఫోన్‌ను బ్లాక్ చేయాలని సూచించారు. అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేస్తే ఫోన్‌ను గుర్తించి తిరిగి అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
ప్రజలకు మరో ముఖ్యమైన సూచన కూడా చేశారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా విక్రేత నుంచి బిల్లు లేదా రసీదు తీసుకోవాలని సూచించారు. తక్కువ ధరకు వస్తోందని భావించి దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అదేవిధంగా మొబైల్ ఫోన్లను విక్రయించాలనుకునే వారు అనధికారిక వ్యక్తులకు లేదా తెలియని మొబైల్ షాపులకు అమ్మకుండా, సంబంధిత కంపెనీల అధికారిక ఎక్స్చేంజ్ కార్యక్రమాల ద్వారానే విక్రయించాలని సూచించారు. అనధికారికంగా విక్రయించిన ఫోన్లు సైబర్ నేరాలకు వినియోగించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
సీఈఐఆర్ వ్యవస్థ ద్వారా పోయిన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించడంలో విశేష కృషి చేసిన జిల్లా ఐటీ కోర్ ఎస్‌ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేష్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వారి సాంకేతిక నైపుణ్యం, కృషి వల్లే జిల్లా ఈ స్థాయి ఫలితాలను సాధించగలిగిందని ప్రశంసించారు.
రికవరీ అయిన మొబైల్ ఫోన్లను తిరిగి అందుకున్న బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పోయిన ఫోన్లు తిరిగి దొరుకుతాయని ఆశించలేదని, కానీ పోలీసుల కృషితో తమ విలువైన సమాచారం, వ్యక్తిగత డేటా సురక్షితంగా తిరిగి లభించిందని చెప్పారు.
రాష్ట్ర స్థాయిలో వరుసగా మూడో ఏడాది ప్రథమ స్థానం సాధించడంతో పాటు, దక్షిణ భారత రాష్ట్రాల స్థాయిలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అగ్రస్థానంలో నిలవడం జిల్లా పోలీసు శాఖ పనితీరుకు నిదర్శనమని ప్రజలు అభినందిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తూ ప్రజల ఆస్తులను కాపాడడంలో రాజన్న సిరిసిల్ల పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు.
Hyderabad,Telangana
Jul 14, 2026 10:16 AM IST
