Last Updated:
బ్యాంక్‌లో బంగారం పెట్టి గోల్డ్ లోన్ తీసుకోవాలంటేనే భయమేస్తోంది. ఇటీవల గోల్డ్ లోన్ మోసాలు నానాటికీ పెరుగుతున్నాయి.
బయట వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు పెడితే అధిక వడ్డీలు కట్టలేమని, తమ బంగారానికి భద్రత ఉండదన్న భయంతో సామాన్యులు బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. కష్టకాలంలో తమ ఆభరణాలను బ్యాంకుల్లో కుదువబెట్టి అవసరాలు తీర్చుకుంటారు. అధికారులు సైతం బ్యాంకుల్లో బంగారానికి నూరు శాతం భద్రత ఉంటుందని ప్రచారం చేస్తుంటారు. కానీ, భద్రతకు మారుపేరుగా నిలవాల్సిన బ్యాంకుల్లోనే పసిడికి రక్షణ కరువవుతోంది. జూలై 7న ఈ సంఘటన జరగగా జూలై 14న వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఓ భారీ కుంభకోణం కస్టమర్ల గుండెల్లో గుబులు రేపుతోంది. ఏకంగా కోటి రూపాయల విలువైన బంగారాన్ని ఓ అప్రైజర్ గోల్ మాల్ చేయడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న నగలు మాయం కావడంతో కస్టమర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) సమీపంలో బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ నడుస్తోంది. ఆసుపత్రిలో పనిచేసే పలువురు చిరుద్యోగులతో పాటు స్థానికులు తమ ఆర్థిక అవసరాల నిమిత్తం ఇక్కడే లావాదేవీలు సాగిస్తుంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య ఖర్చుల కోసం తమ విలువైన ఆభరణాలను ఈ బ్రాంచిలోనే తాకట్టు పెడుతుంటారు. చేతికి డబ్బులు రాగానే అసలు, వడ్డీ చెల్లించి తమ ఆభరణాలను విడిపించుకుని సంతోషంగా ఇళ్లకు వెళుతుంటారు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ నమ్మకమైన ప్రయాణంలో కస్టమర్లకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. నమ్మకంగా ఉన్న బ్యాంకులో ఇలాంటి మోసం జరుగుతుందని బ్రాంచికి వచ్చే ఖాతాదారులు కలలో కూడా ఊహించలేదు.
తాము కుదువబెట్టిన నగలను విడిపించుకునేందుకు వచ్చిన కొందరు ఖాతాదారులకు బ్యాంకు సిబ్బంది తిరిగి ఇచ్చిన ఆభరణాలను చూసి అవాక్కయ్యారు. వారు ఇచ్చిన పసిడికి బదులుగా నకిలీ రోల్డ్ గోల్డ్ నగలను సిబ్బంది చేతిలో పెట్టారు. తాము తెచ్చిన అసలు నగలు ఏవంటూ ఖాతాదారులు నిలదీయడంతో అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. కస్టమర్లు లబోదిబోమంటూ బ్యాంకులో ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కస్టమర్ల ఫిర్యాదుతో బ్రాంచ్ మేనేజర్ సైతం ఈ మోసాన్ని చూసి కంగుతిన్నారు. అసలు ఇంత పక్కాగా రోల్డ్ గోల్డ్ నగలు బ్యాంకు లాకర్లలోకి ఎలా వచ్చాయి అన్న విషయం పై అధికారులు తలలు పట్టుకున్నారు.
బ్యాంకు అధికారుల అంతర్గత విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. బ్యాంకులో నమ్మకంగా పనిచేస్తున్న అప్రైజరే ఈ భారీ మోసానికి తెరతీసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కస్టమర్లు తెచ్చిన అసలు ఆభరణాలను మాయం చేసి, వాటి స్థానంలో అచ్చు గుద్దినట్లు ఉండే నకిలీ రోల్డ్ గోల్డ్ నగలను లాకర్లలో ఉంచినట్లు గుర్తించారు. ఇలా ఏకంగా 786 గ్రాముల పసిడిని అప్రైజర్ కాజేసినట్లు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీని విలువ మార్కెట్లో సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో బంగారం పక్కదారి పట్టడం కాకినాడ నగరంలో తీవ్ర కలకలం రేపింది.
ఖాతాదారుల ఆందోళన, అప్రైజర్ నిర్వాకంపై బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ నరసింహ భాను అభిరామ్ పోలీసులను ఆశ్రయించారు. కాకినాడ వన్ టౌన్ సీఐ నాగ దుర్గారావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ వెంటనే దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ భారీ కుంభకోణంలో అప్రైజర్‌తో పాటు ఇంకెవరి పాత్ర అయినా ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఎంతమంది కస్టమర్లు మోసపోయారు, మాయమైన అసలు బంగారం ఎక్కడికి చేరింది అన్న పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసు అధికారులు మీడియాకు స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు.
East Godavari,Andhra Pradesh
