Last Updated:
సివిల్ సర్వీసెస్ పరీక్షలో నెగ్గి ఐఏఎస్, ఐపీఎస్ కావాలన్నది మీ కలా? లక్షలు ఖర్చు పెట్టకండి.. సర్కార్ ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ చూడండి!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో నెగ్గి ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలన్నది నేటి యువత కల. అందుకోసం అభ్యర్థులు రేయింబవళ్లు శ్రమిస్తూ కఠినమైన సాధన చేస్తుంటారు. ఆర్థికంగా వెనుకబడిన నిరుద్యోగ యువత కలను సాకారం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గొప్ప బాసటగా నిలుస్తోంది. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 2027 యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచితంగా అత్యుత్తమ శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ బీసీ స్టడీ సర్కిల్‌లో ఈ ఉచిత దీర్ఘకాలిక ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ శిక్షణ కొనసాగుతుంది.
ఈ ఏడాది ఆగస్టు 24వ తేదీన ప్రారంభమయ్యే ఈ తరగతులు వచ్చే ఏడాది మే నెల వరకు నిర్విరామంగా కొనసాగుతాయి. మొత్తం 150 మంది అభ్యర్థులకు మాత్రమే ఈ ఉచిత శిక్షణకు ఎంపిక చేస్తారు. ఇందులో 100 మందిని ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష ఆధారంగా మెరిట్ పద్ధతిలో ఎంపిక చేస్తారు. గతంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన మరో 50 మంది అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్షతో పనిలేకుండానే నేరుగా ప్రవేశం కల్పిస్తారు. నిరుపేద అభ్యర్థులకు లక్షలు వెచ్చించి ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకోలేని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశం నిజంగా ఒక వరం లాంటిది.
ఈ ఉచిత శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులకు కచ్చితంగా కొన్ని ప్రాథమిక అర్హతలు ఉండాలని ఆదిలాబాద్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి. ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులైతే కుటుంబ వార్షిక ఆదాయం లక్షన్నర రూపాయల లోపు, పట్టణ ప్రాంత విద్యార్థులైతే రెండు లక్షల రూపాయల లోపు మాత్రమే ఉండాలి. దరఖాస్తుదారులు ప్రస్తుతం ఇతర విద్యా కోర్సులు రెగ్యులర్ విధానంలో అభ్యసించకూడదు. గతంలో ప్రభుత్వ సంక్షేమ శాఖల ద్వారా ఇటువంటి ఉచిత శిక్షణ తీసుకుని ఉండకూడదు. యూపీఎస్సీ 2027 నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితి సహా అన్ని అర్హతలు కలిగి ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో ప్రభుత్వం అద్భుతమైన సదుపాయాలు కల్పిస్తోంది. తరగతులకు క్రమం తప్పకుండా హాజరయ్యే నిబంధనలకు లోబడి ప్రతి నెలా ఐదు వేల రూపాయల స్టైఫండ్ అందిస్తారు. ప్రామాణికమైన మెటీరియల్, పుస్తకాలు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఒకేసారి ఐదు వేల రూపాయల పుస్తక నిధిని అందజేస్తారు. విశాలమైన గ్రంథాలయ సౌకర్యంతో పాటు ఆయా సబ్జెక్టుల్లో దశాబ్దాల అనుభవం ఉన్న నిపుణులైన అధ్యాపకులతో నాణ్యమైన బోధన అందిస్తారు. అభ్యర్థులు ఏకాగ్రతతో చదువుకుని లక్ష్యాన్ని చేరుకునేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో, పోటీ పరీక్షలకు తగ్గట్టుగా స్టడీ సర్కిల్ నిర్వహణ ఉంటుంది.
ఈ ఉచిత శిక్షణకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు ఏడవ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి ఆగస్టు 16వ తేదీన ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను ఆగస్టు 13 నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 19న తుది ఫలితాలు వెల్లడించి, 21వ తేదీ నుంచి ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన చేపడతారు. ఆగస్టు 24 నుంచి అధికారికంగా తరగతులు మొదలవుతాయి. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో చదువుతున్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ కోరారు.
Adilabad,Telangana

