వడ్డెర జాతి గర్వకారణం.. ఎమ్మెల్సీ దళవాయి రమాదేవికి ఘన సన్మానం
అనంతపురం , ప్రభ న్యూస్ , సెప్టెంబర్ 21 :
వడ్డెర జాతి గౌరవాన్ని చట్టసభలో చాటుతూ ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన వడ్డే దళవాయి రమాదేవికి ఘన ఆత్మీయ అభినందన సభ నిర్వహించేందుకు వడ్డెర సమాజం సిద్ధమైంది. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ప్రతిఫలంగా చట్టసభలో అడుగుపెట్టిన తమ ఆడబిడ్డను ఘనంగా సత్కరించేందుకు ఉమ్మడి జిల్లాలోని వడ్డెర బంధువులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ నెల 22వ తేదీ మంగళవారం ఉదయం 10:30 గంటలకు అనంతపురంలోని ఎం.వై.ఆర్. ఫంక్షన్ హాల్, పాత ఏపీ లైటింగ్, బళ్లారి రోడ్డులో అభినందన సభ నిర్వహించనున్నారు. పార్టీలకు అతీతంగా వడ్డెర సమాజానికి చెందిన విద్యావంతులు, మేధావులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఈ కార్యక్రమానికి హాజరై తమ ఐక్యతను చాటాలని నిర్వాహకులు కోరారు.
వడ్డెర జాతి హక్కులు, ఆత్మగౌరవం కోసం సాగిన సుదీర్ఘ పోరాటానికి ప్రతీకగా ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి చట్టసభలో అడుగుపెట్టడం సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు. జాతి కోసం కృషి చేసిన తమ బిడ్డను గౌరవించడంతో పాటు, చట్టసభలో వడ్డెర సమాజం తరఫున తమ వాణిని వినిపించే రమాదేవికి అండగా నిలవాల్సిన సమయం ఇదేనన్నారు.
వడ్డే ఓబన్న ఆశయాలకు స్ఫూర్తిగా, వడ్డెర జాతి ఐక్యతకు నిదర్శనంగా ఈ అభినందన సభను విజయవంతం చేద్దామని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, ప్రతి వాడ నుంచి వడ్డెర బంధువులు కుటుంబ సమేతంగా అనంతపురానికి తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తమ ఆడబిడ్డను గౌరవించడం ద్వారా జాతి ఐక్యతను, ఆత్మగౌరవాన్ని చాటుదామని, వడ్డెర సమాజం ఒకే వేదికపై తన ఐక్యతను ప్రదర్శించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

