Last Updated:
డీఆర్ఐ ‘ఆపరేషన్ డీప్ మానిఫెస్ట్’లో భాగంగా పాకిస్థాన్ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న 362 మెట్రిక్ టన్నుల ఎండు ఖర్జూరాలను స్వాధీనం చేసుకుంది.
పాకిస్థాన్ నుంచి వస్తున్న వస్తువులను అక్రమంగా మళ్లించి ఇండియాకు దిగుమతి చేసుకునే ప్రయత్నాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) గట్టి చర్యలు తీసుకుంది. ‘ఆపరేషన్ డీప్ మానిఫెస్ట్’లో భాగంగా పాకిస్థాన్‌కు చెందిన 362 మెట్రిక్ టన్నులకు పైగా ఎండు ఖర్జూరాలను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముంబైకి చెందిన ఓ సంస్థ దిగుమతి చేసిన ఎండు ఖర్జూరాలతో ఉన్న 13 కంటైనర్లను నాసిక్‌లోని సీఎఫ్ఎస్ అంబాడ్ వద్ద డీఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు. ఈ సరుకు యూఏఈలోని జెబెల్ అలీ నుంచి భారత్‌కు వచ్చింది. అయితే, దిగుమతి పత్రాల్లో సరుకు సోర్స్ కంట్రీ యూఏఈని చూపించారు. ప్రాథమిక దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. పాకిస్థాన్‌లో తయారైన ఈ సరుకు సోర్సును దాచేందుకు ముందుగానే పక్కాగా ప్లాన్ చేసిన ట్రాన్స్షిప్మెంట్ ఏర్పాటు చేసినట్టు తేలింది.

