Last Updated:
Money Tips | మీ జీతం పెరిగిన ప్రతిసారీ ఖర్చులు కూడా పెరుగుతున్నాయా? కొత్త కారు, పెద్ద ఇల్లు, ఖరీదైన వెకేషన్లు, ఎక్కువ ఈఎంఐలు ఇలా లైఫ్‌స్టైల్ పెంచుకుంటూ పోతే ఆదాయం పెరిగినా సంపద మాత్రం పెరగకపోవచ్చు. దీన్నే లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్ అంటారు. ఇది ఎలా మీ సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను దెబ్బతీస్తుందో తెలుసుకుందాం.
ప్రమోషన్, జీతం పెరగడం, వ్యాపారం బాగా సాగడం లేదా పెద్ద మొత్తంలో బోనస్ రావడం సాధారణంగా ఆర్థికంగా ముందుకు వెళ్తున్నామనే సంకేతాలుగా భావిస్తాం. కానీ ఆదాయం పెరిగినా సంపద పెరగకుండా చేసే ఒక నిశ్శబ్ద అలవాటు ఉంది. అదే లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్. ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరగడాన్నే లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్ అంటారు. మంచి కారు, పెద్ద ఇల్లు, ఖరీదైన వెకేషన్లు, తరచూ బయట తినడం, ప్రీమియం గ్యాడ్జెట్లు, ఖరీదైన సబ్‌స్క్రిప్షన్లు వంటివి ఒక్కొక్కటిగా చూస్తే భరించగలిగినవిగానే అనిపిస్తాయి. కానీ ఇవే ఖర్చులు శాశ్వత నెలవారీ బాధ్యతలుగా మారితే, సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం మిగిలే డబ్బు బాగా తగ్గిపోతుంది. ఇందులో అసలు ప్రమాదం ఏంటంటే… లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్ మొదలైనప్పుడు అది ఆర్థిక సమస్యలా అనిపించదని చెబుతున్నారు హైదరాబాద్‌లోని అఖిల్ కంచర్ల అండ్ అసోసియేట్స్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ అఖిల్ కంచర్ల. న్యూస్18 తెలుగుతో అఖిల్ కంచర్ల మాట్లాడుతూ ముఖ్యమైన సలహాలు ఇచ్చారు.

