అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని,ఏ ఒక్క అర్హుడైన ఓటరు జాబితా నుండి విస్మరించబడకూడదన్నారు.అదేవిధంగా ఏ ఒక్క అనర్హుడి పేరు జాబితాలో ఉండకూడదు అనేదే ఈ మొత్తం ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ స్పష్టం చేశారు.
గ్రామాలు,పట్టణాల్లో శాశ్వతంగా వలస వెళ్లిన వారు, మరణించిన వారు,అసలు ఓటరు కాని వారి పేర్లను గుర్తించి జాబితా నుండి తొలగిస్తామని,అదే సమయంలో వాస్తవ్యులైన అర్హులందరి పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేయడం జరుగుతుందని వివరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 98 శాతం ఫారాల పంపిణీ పూర్తి.రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,75,694 మంది ఓటర్లు ఉన్నారని,అందులో ఇప్పటివరకు 4,69,101 ఇన్యుమరేషన్ ఫారాలను విజయవంతంగా పంపిణీ చేశామని కలెక్టర్ వెల్లడించారు. ఇది దాదాపు 98.1 శాతంగా నమోదైందని,మిగిలిన ఫారాల పంపిణీ కూడా వేగంగా కొనసాగుతోందని చెప్పారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఈ ఫారాలను పూర్తి చేసి అందించాలని, నిర్ణీత గడువులోగా ఫారాలు సమర్పించని వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించే అవకాశం ఉందన్నారు.
2002 ఓటర్ల జాబితా ఆధారంగా పరిశీలనఈ ఇన్యుమరేషన్ ప్రక్రియ చాలా సరళంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. 2002 నాటి ఎలక్టోరల్ రోల్‌లో పేరు ఉన్న వారు తమ పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్, నియోజకవర్గం పేరు తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ అప్పట్లో ఓటరుగా నమోదు కాకపోతే,వారి తల్లిదండ్రుల యొక్క 2002 నాటి ఎపిక్ కార్డ్ ( Voter ID card) వివరాలను అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2002 ఓటర్ల జాబితాకు సంబంధించిన సందేహాలు ఉంటే ఓటర్లు నేరుగా (సీఈఓ తెలంగాణ) CEO Telangana అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చని లేదా తమ పరిధిలోని బిఎల్‌ఓల వద్ద అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించవచ్చని సూచించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక శిక్షణ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 549 మంది బిఎల్‌ఓలకు మాస్టర్ ట్రైనర్లు, ఏఈఓలు,ఈఆర్‌ఓల ద్వారా ఇప్పటికే పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చామని,వారు ఓటర్లకు ఫారాలు నింపడంలో సహాయం అందిస్తారని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు కూడా తమ బూత్ స్థాయి ఏజెంట్లను (బిఎల్ఏలను) నియమించుకోవచ్చని, వారు ఐడీ కార్డులతో బిఎల్‌ఓలతో కలిసి ఈ ప్రక్రియను పర్యవేక్షించవచ్చని కలెక్టర్ చెప్పారు.ఈ ప్రక్రియపై ప్రతి బుధవారం ఈఆర్‌ఓల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాలు ఉంటాయన్నారు.
తప్పుల సవరణకు అవకాశం ఓటర్ల పేర్లలో స్పెల్లింగ్ దోషాలు లేదా ఇతర క్లరికల్ పొరపాట్లు (అనోమలీస్) ఉంటే ఈఆర్‌ఓల ద్వారా నోటీసులు జారీ చేయడం జరుగుతుందని,అటువంటప్పుడు ఓటరు ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించి తప్పులను సరిదిద్దుకోవచ్చని కలెక్టర్ గరిమ అగ్రవాల్ వివరించారు. ఈ ప్రక్రియ కోసం జిరాక్స్ ప్రతులు సమర్పించాల్సిన అవసరం లేదని,కేవలం ఇన్యుమరేషన్ ఫారంతో పాటు ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అందజేస్తే సరిపోతుందని స్పష్టం చేశారు.
బిఎల్‌ఓలు సేకరించిన వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన అనంతరం ఆగస్టు 30వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా (డ్రాఫ్ట్) ప్రచురిస్తామని,ఆపై అక్టోబర్ 1, 2026న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ వివరించారు.
