పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం.. ప్రజల భద్రతకు నిరంతర సేవలు!
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులదే కీలక పాత్ర: కలెక్టర్ దివాకర టి.ఎస్. – అమరవీరుల కుటుంబాలకు ఘన సత్కారం
ప్రభ న్యూస్, ఖమ్మం, అక్టోబర్ 21:
ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పిస్తూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేస్తున్న సేవలు, విధి నిర్వహణలో వారు చేస్తున్న త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. ప్రజలకు భరోసా కల్పిస్తూ సమాజంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం పోలీస్ హెడ్‌క్వార్టర్స్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్మృతి పరేడ్‌లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పాల్గొన్నారు. అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. పోలీస్ జెండా కేవలం ఒక వస్త్రం కాదని, అది పోలీసుల నిబద్ధత, త్యాగం, గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా సాగేందుకు శాంతిభద్రతలు ఎంతో అవసరమని, ప్రజలకు రక్షణ కల్పిస్తూ పోలీసులు నిరంతరం విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించడంలో వారి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని, విధి నిర్వహణలో పోలీసులకు అండగా నిలుస్తున్న కుటుంబ సభ్యుల త్యాగాలను కూడా సమాజం గుర్తించాలని అన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు సహా నేరాల స్వరూపం వేగంగా మారుతోందని, కొత్త తరహా నేరాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీసింగ్ విధానాలను ఎప్పటికప్పుడు ఆధునీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం పరస్పర సమన్వయంతో పనిచేస్తూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న లడఖ్ ప్రాంతంలో చైనా సైనికులతో పోరాడుతూ దేశ సరిహద్దుల రక్షణలో పది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది సేవలు, త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటామని చెప్పారు. తెలంగాణలో ఒకప్పుడు నక్సలిజం, తీవ్రవాద సమస్యలు తీవ్రంగా ఉండేవని, పోలీసుల నిరంతర కృషి, త్యాగాల ఫలితంగా శాంతిభద్రతల పరిరక్షణకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శాలువాలతో సత్కరించి గౌరవించారు. ఈ సందర్భంగా నలుగురు పోలీసు సిబ్బంది ఇంటి స్థలాలకు సంబంధించిన సమస్యలపై కలెక్టర్ స్పందించి, వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించడంతో పాటు సంబంధిత ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. కేటాయించిన స్థలాలను స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రామానుజం, ఏఆర్ డీసీపీలు కుమారస్వామి, విజయబాబు, ఏఆర్ ఏసీపీలు సుశీల్ సింగ్, నర్సయ్య, ఏసీపీలు రమణమూర్తి, మహేష్, సాంబరాజు, నర్సింహారావు, సీఐలు, ఆర్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


