Last Updated:
Nithya Menen: బయటి ప్రపంచానికి స్టార్ హీరోయిన్‌గా కనిపిస్తున్నప్పటికీ, పబ్లిక్ అటెన్షన్ తనకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుందని నేషనల్ అవార్డ్ విన్నర్ నిత్యా మీనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను యోగా టీచర్ అయి ఉంటే జీవితం ఎంతో ప్రశాంతంగా ఉండేదని ఆమె పేర్కొన్నారు…
Nithya Menen: సౌత్ ఇండియాలో తన సహజ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ నిత్యా మీనన్. ‘తిరుచిత్రంబళం’ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ఆమె.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎప్పుడూ ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడే నిత్యా మీనన్.. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బయటి ప్రపంచానికి స్టార్ హీరోయిన్‌గా కనిపిస్తున్నప్పటికీ, పబ్లిక్ అటెన్షన్ తనకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుందని ఆమె ఓపెన్ అయి సంచలనం రేపారు.
సాధారణంగా సెలబ్రిటీలంటే అందరూ తమను గుర్తుపట్టాలని, ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉండాలని కోరుకుంటారు. కానీ నిత్యా మీనన్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా స్పందించారు. నేషనల్ అవార్డ్ గెలిచిన స్టార్ నటి అయినప్పటికీ, బయటకు వెళ్లినప్పుడు జనం తనను ఎప్పుడూ గుర్తుపట్టడం, అందరి దృష్టి తనపైనే ఉండటం తనకు అసౌకర్యంగా అనిపిస్తుందని నిత్యా తెలిపారు.
ప్రశాంతమైన జీవితం వద్దు అనుకున్నా.. “ఒకవేళ నేను కేవలం ప్రశాంతమైన జీవితం మాత్రమే కోరుకుని ఉంటే.. ఒక యోగా టీచర్‌గా మారిపోయేదాన్ని. అదే నాకు అత్యంత సులభమైన, ప్రశాంతమైన మార్గం” అని ఆమె చెప్పుకొచ్చారు.
సవాళ్ల కోసమే సినిమాలు.. కేవలం కంఫర్ట్ జోన్‌లో ఉండిపోకుండా, జీవితంలో కొత్త సవాళ్లను స్వీకరించడానికి, కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఎదగడానికే తాను సినిమా రంగాన్ని ఎంచుకున్నానని నిత్యా మీనన్ స్పష్టం చేశారు.
చిన్నతనంలో ఎవరైనా తనను తదేకంగా చూస్తుంటే తట్టుకోలేక అక్కడి నుండి వెళ్లిపోమని చెప్పేంత సిగ్గు, బిడియం తనకు ఉండేవని నిత్యా గుర్తుచేసుకున్నారు. ఆ అసౌకర్యం వెనుక ఉన్న కారణాలను వెతుక్కుంటూ వెళ్లడం వల్లే తన ఆత్మవిశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. జీవితంలో ప్రేమ, గుర్తింపు కోరుకోవడం తప్పు కాకపోయినా.. నటన, సినిమా అనేవి తన జీవితంలో ఒక భాగం మాత్రమే తప్ప, అవే పూర్తి జీవితం కాదని ఆమె తేల్చి చెప్పారు.
గతేడాది ‘కాదలిక్క నేరమిల్లై’, ‘తలైవన్ తలైవి’, ధనుష్ ‘ఇడ్లీ కడై’ చిత్రాల్లో అలరించిన నిత్యా మీనన్.. త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’లో నిత్యా కీలక పాత్ర పోషిస్తున్నారు. వివాహేతర సంబంధం, ఆర్థిక మోసం నేపథ్యంలో సాగే ఈ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.

