Last Updated:
విలక్షణ కథలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
విలక్షణ కథలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, ‘ఇదీ సంగతి’, ‘ఆటగదరా శివా’ వంటి విభిన్న చిత్రాలను రూపొందించిన ఆయన తాజాగా ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో సినిమా తెరకెక్కించారు. ‘ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా…’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో రూపొందిన సినిమాగా ఈ చిత్రం ఇప్పటికే ప్రత్యేక ఆసక్తిని క్రియేట్ చేసింది.
ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో రూపొందిన ఈ సినిమాను వై.వి. సత్యనారాయణ రాజు సమర్పణలో ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై చంద్ర సిద్ధార్థ్ నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందు తాజాగా టీజర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. టీజర్‌ను వీక్షించిన అనిల్ రావిపూడి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఇంత పొడవైన టైటిల్‌తో సినిమా రావడం ఆసక్తికరంగా ఉందన్నారు. చంద్ర సిద్ధార్థ్ తెరకెక్కించిన ‘మధుమాసం’, ‘హౌస్‌ఫుల్’, ‘అందరి బంధువయా’ సినిమాలకు తాను స్క్రిప్ట్ విభాగంలో పనిచేశానని గుర్తుచేసుకున్నారు. చంద్ర సిద్ధార్థ్ ఎప్పుడూ సెన్సిబుల్ కథలను ఎంచుకుంటారని, ఈసారి కూడా భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
దర్శక నిర్మాత చంద్ర సిద్ధార్థ్ మాట్లాడుతూ.. తమ సినిమా టీజర్‌ను విడుదల చేసిన అనిల్ రావిపూడికి కృతజ్ఞతలు తెలిపారు. తాము అడిగిన వెంటనే టీజర్ లాంచ్‌కు అంగీకరించారని, బిజీ షెడ్యూల్‌లో కూడా తమ కోసం సమయం కేటాయించారని చెప్పారు. అనిల్ రావిపూడికి టైటిల్, టీజర్ నచ్చడం తమకు పాజిటివ్ సైన్‌గా భావిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే టైటిల్‌కు మంచి స్పందన వచ్చిందని, ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెరిగిందని చెప్పారు. ఇప్పటివరకు వచ్చిన థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా తమ చిత్రం ఉంటుందని, థియేటర్లలో మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక టీజర్ విషయానికి వస్తే.. హీరో హర్ష ‘నీ రేడియో కావాలి’ అంటూ ఓ ఇంటికి వెళ్లడంతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. అక్కడ రేఖా నిరోషా పోషించిన పాత్ర ‘నేను వద్దా?’ అని అడగడం, ఆమె భర్త ఇచ్చే రియాక్షన్ ఆసక్తిని పెంచుతుంది. మరో సన్నివేశంలో ఇనాయా సుల్తానాను ఉద్దేశించి ‘మిమ్మల్ని ఎలా వదులుకున్నారు?’ అని అడగ్గా.. ‘ఎప్పుడూ మీరే వదిలేయాలా? మేం వదలకూడదా?’ అంటూ ఆమె ఇచ్చే సమాధానం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ప్రేయసిని షేర్ చేసుకోవాలనుకునే ప్రియుడు, పెళ్లి పీటలపై భర్తతో పాటు మరొకరు కావాలని కోరుకునే భార్య వంటి సన్నివేశాలతో టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. మిస్టికల్ మ్యూజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య సంబంధాన్ని కథలో కీలక అంశంగా చూపించనున్నారు. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, మెమరీస్, గిల్ట్ వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించినట్లు తెలుస్తోంది.
హర్ష హీరోగా నటిస్తుండగా అమైరా గోస్వామి, సుజనా రెడ్డి కథానాయికలుగా పరిచయం అవుతున్నారు. ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్ వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జే రెక్స్ సంగీతం అందించిన ఈ చిత్రానికి పులగం చిన్నారాయణ మాటలు రాశారు. సామ్ సుప్రీత్ సినిమాటోగ్రఫీ, బొబ్బిలి భానుప్రకాశ్, గిరిధర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సెప్టెంబర్ 18న ఈ మిస్టికల్ థ్రిల్లర్ థియేటర్లలో సందడి చేయనుంది.

