Last Updated:
WhatsApp Web: మీరు వాట్సాప్ వాడుతున్నారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. మాల్వేర్ దాడులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఐతే.. డెస్క్‌టాప్ వెర్షన్‌పై ఈ దాడి జరుగుతోంది. అసలు ఏమవుతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
ఢిల్లీ: వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో మాల్‌వేర్ దాడులు జరుగుతున్నాయని భారత జాతీయ సైబర్ సెక్యూరిటీ పర్యవేక్షణ సంస్థ CERT-In హెచ్చరించింది. ఈ దాడుల ద్వారా వాట్సాప్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. తర్వాత.. ఆ అకౌంట్‌లోని యూజర్ స్నేహితులు, బంధువులు, సహోద్యోగులకు అనుమానాస్పదమైన అటాచ్‌మెంట్లను పంపుతున్నారు. వాటిని ఓపెన్ చేస్తే.. మొబైల్ లేదా ల్యాప్‌టాప్ వంటివి సైబర్ నేరగాళ్ల కంట్రోల్ లోకి వెళ్లిపోతాయి అని CERT-In స్పష్టం చేసింది.
మన ఒక ఉదాహరణ చూస్తే.. రఘు.. తన ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ వెబ్ వాడుతూ ఉంటాడు. అతనికి అనుకోకుండా ఒక వీడియో లాంటిది కనిపిస్తుంది. అది చూద్దామని క్లిక్ చేస్తాడు. కానీ అది నిజానికి వీడియో కాదు. దానితోపాటూ.. ఒక అటాచ్‌మెంట్ ఉంటుంది. అతను వీడియో లాంటి దానిపై క్లిక్ చెయ్యగానే.. ఆ అటాచ్‌మెంట్ పనిచెయ్యడం ప్రారంభించి.. అతని వాట్సాప్ అకౌంట్‌ను హ్యాక్ చేస్తుంది. దాంతో అతను వాట్సాప్‌ని వాడలేడు. అదే సమయంలో.. హ్యాకర్.. అతని వాట్సాప్‌ని ఉపయోగించి, అతని ఫ్రెండ్స్‌కి హ్యాకింగ్ లింక్స్ పంపిస్తారు. ఆ ఫ్రెండ్స్.. ఆ లింకులను తెలియక క్లిక్ చేస్తారు. ఎందుకంటే.. అవి వచ్చింది రఘు నుంచి కదా.. అనే ఆలోచనలో వారు ఉంటారు. అవి హ్యాకర్ నుంచి వచ్చాయని వారికి తెలియదు. వారు ఆ లింక్స్ క్లిక్ చేసినప్పుడు.. వారి మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు హ్యాక్ అవుతాయి. ఆ తర్వాత ఏమవుతుందో మనకు తెలుసు.. బ్యాంక్ అకౌంట్లలో డబ్బు మాయమవుతుంది. రహస్యాలు, వీడియోలు, ఫొటోలు, పాస్‌వర్డ్స్ అన్నీ హ్యాకర్లకు చేరిపోతాయి. దాంతో కలిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడ రఘుకి మరో సమస్య కూడా ఎదురవుతుంది. అతను జైలుకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఎలా గంటే.. రఘు పేరుతో హ్యాకర్ పంపిన లింకును క్లిక్ చేసిన అతని ఫ్రెండ్.. తన బ్యాంక్ అకౌంట్‌లో రూ.4 లక్షలు పోగొట్టుకున్నాడని అనుకుందాం. ఇప్పుడు అతను.. తన డబ్బు తనకు ఇవ్వాలని రఘుపై ఒత్తిడి చెయ్యగలడు. “నాకు లింక్ నువ్వే పంపావు. సో.. నువ్వే నా డబ్బు పోవడానికి కారకుడివి. నువ్వు ఇవ్వకపోతే, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను” అని అతని ఫ్రెండ్.. పోలీస్ కంప్లైంట్ ఇస్తే.. పోలీసులు ముందుగా.. రఘును అరెస్టు చేస్తారు. ఆ తర్వాత హ్యాకింగ్ కేసును దర్యాప్తు చేస్తారు. ఇలా వరుస సమస్యలు వెంటాడతాయి.
ఇదంతా వద్దు అనుకుంటే.. మనం చెయ్యాల్సింది.. అనుమానాస్పద లింకులు, అటాచ్‌మెంట్లను క్లిక్ చెయ్యకుండా ఉండాలి. అలాగే.. మన మొబైల్, ల్యాప్‌టాప్‌లలో సెక్యూరిటీ ఫీచర్లను ఆన్‌లో ఉంచుకోవాలి. చాలా మంది ల్యాప్‌టాప్‌లో ఫైర్‌వాల్‌ని ఆఫ్ చేస్తారు. అది ప్రమాదకరమే. దాన్ని ఆన్‌లో ఉంచుకోవాలి. లేదా.. ఏదైనా మాల్వేర్ లను అడ్డుకునే యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ని వాడాలి.
హ్యాకర్లు ఎలా చేస్తున్నారు?
హ్యాకర్లు ముందుగా కొన్ని WhatsApp అకౌంట్లను హ్యాక్ చేసి, వాటి కాంటాక్ట్స్‌కు మాలీషియస్ Visual Basic Script (.vbs) ఫైళ్లను పంపుతున్నారు. ఈ ఫైళ్లు ఇన్‌వాయిస్, బ్యాంక్ స్టేట్‌మెంట్, డెబిట్ కన్ఫర్మేషన్, రికన్సైలియేషన్ వంటి బిజినెస్ లేదా ఫైనాన్షియల్ డాక్యుమెంట్లుగా మారువేషం వేసుకుని ఉంటాయి. ఈ దాడి మల్టీ-స్టేజ్ ఇన్‌ఫెక్షన్ చైన్‌ను ఉపయోగిస్తుంది. మొదటి స్టేజ్‌లో .vbs ఫైల్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత.. ఇతర VBS స్క్రిప్టులను డౌన్‌లోడ్ చేసుకుంటుంది. రెండవ స్టేజ్‌లో User Account Control (UAC) సెట్టింగ్స్‌ను మార్చడం ద్వారా అడ్మిన్ ప్రివిలేజెస్ పొందే ప్రయత్నం చేస్తుంది. మూడవ స్టేజ్‌లో ManageEngine Endpoint Central వంటి RMM సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి, హ్యాకర్లు దూరం నుంచి మొబైల్‌ని పూర్తిగా కంట్రోల్ చెయ్యగలరు. దీంతో పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ వివరాలు, సెన్సిటివ్ డేటాని చోరీ చేస్తున్నారు.
లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana

