భారతదేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరుగుతోంది. 2026 సెప్టెంబర్ నాటికి దేశంలో శిలాజేతర ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 308.027 గిగావాట్లకు చేరింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే సుమారు 55.29 గిగావాట్ల సామర్థ్యం అదనంగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ విద్యుత్ ఉత్పత్తిని అవసరమైన సమయానికి వినియోగించుకోవాలంటే నిల్వ వ్యవస్థలు కూడా బలంగా ఉండాలి. కేంద్ర విద్యుత్ అథారిటీ (CEA) అంచనా ప్రకారం, 2031-32 నాటికి దేశానికి 73.93 గిగావాట్ల విద్యుత్ నిల్వ సామర్థ్యం అవసరం. ఇందులో 26.69 గిగావాట్లు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల నుంచి, 47.24 గిగావాట్లు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) నుంచి రావాల్సి ఉంటుంది.
పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులో సాధారణంగా వేర్వేరు ఎత్తుల్లో రెండు నీటి జలాశయాలు ఉంటాయి. విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉండి, వినియోగం తక్కువగా ఉన్న సమయంలో అదనపు విద్యుత్‌ను ఉపయోగించి దిగువ జలాశయం నుంచి నీటిని పై జలాశయానికి పంపిస్తారు. ఇలా నీటిని ఎత్తుకు చేర్చడం ద్వారా విద్యుత్ శక్తి నిల్వ అవుతుంది. అవసరం పెరిగినప్పుడు పై జలాశయంలోని నీటిని టర్బైన్ల ద్వారా కిందకు విడుదల చేస్తారు. ఆ సమయంలో టర్బైన్లు తిరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. డిమాండ్ తగ్గిన తర్వాత మళ్లీ నీటిని పైకి పంపిస్తారు. ఇలా ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది.
బ్యాటరీ స్టోరేజ్‌తో పోలిస్తే పంప్డ్ స్టోరేజ్ భారీ మొత్తంలో విద్యుత్‌ను ఎక్కువ గంటల పాటు నిల్వ చేయగలదు. బ్యాటరీ వ్యవస్థలు తక్కువ సమయంలో స్పందించి ఫ్రీక్వెన్సీ నియంత్రణ, గ్రిడ్ బ్యాలెన్సింగ్, పీక్ డిమాండ్ నిర్వహణకు ఉపయోగపడతాయి. పంప్డ్ స్టోరేజ్ మాత్రం దీర్ఘకాలిక నిల్వకు అనుకూలం. అయితే వీటి ఏర్పాటుకు సరైన భౌగోళిక పరిస్థితులు, జలాశయాలు అవసరం. అందుకే ఈ రెండు టెక్నాలజీలు ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా కాకుండా, పరస్పర సహాయక వ్యవస్థలుగా పనిచేస్తాయి.
జలాశయాలు సహజ నీటి ప్రవాహాలకు ఎలా అనుసంధానమై ఉన్నాయనే అంశాన్ని బట్టి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను మూడు రకాలుగా విభజిస్తారు. ఆన్-స్ట్రీమ్ విధానంలో రెండు జలాశయాలు నది, వాగు లేదా కాలువకు అనుసంధానమై ఉంటాయి. ఆఫ్-స్ట్రీమ్ ఓపెన్-లూప్ విధానంలో ఒక జలాశయం సహజ నీటి ప్రవాహానికి దగ్గరగా ఉండగా, రెండోది దానికి దూరంగా ఉంటుంది. ఆఫ్-స్ట్రీమ్ క్లోజ్డ్-లూప్ విధానంలో రెండు జలాశయాలూ నిరంతర సహజ నీటి ప్రవాహాలకు దూరంగా ఉంటాయి. నదులపై ఆధారపడే ప్రాజెక్టుల వల్ల పర్యావరణంపై ప్రభావం తగ్గించేందుకు ఆఫ్-స్ట్రీమ్ ప్రాజెక్టుల గుర్తింపుపై కూడా దృష్టి పెడుతున్నారు.
2026 ఆగస్టు నాటికి దేశంలో 10 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా 7.43 గిగావాట్ల సామర్థ్యం అందుబాటులో ఉంది. మరో 15.87 గిగావాట్ల సామర్థ్యం కలిగిన 11 ప్రాజెక్టులు నిర్మాణం లేదా అమలు దశలో ఉన్నాయి. అదనంగా 10.40 గిగావాట్ల సామర్థ్యం కలిగిన ఎనిమిది ప్రాజెక్టులకు CEA ఆమోదం లేదా అంచనా ప్రక్రియ పూర్తయింది. దేశవ్యాప్తంగా మొత్తం 345.38 గిగావాట్ల సామర్థ్యంతో 320 ప్రాజెక్టులను గుర్తించారు. వీటిలో 56.67 గిగావాట్ల సామర్థ్యంతో 62 ఆన్-స్ట్రీమ్ ప్రాజెక్టులు, 288.71 గిగావాట్ల సామర్థ్యంతో 258 ఆఫ్-స్ట్రీమ్ ప్రాజెక్టులు ఉన్నాయి.
ప్రాంతాల వారీగా చూస్తే పశ్చిమ భారతదేశంలో అత్యధికంగా 129.72 గిగావాట్ల సామర్థ్యాన్ని గుర్తించారు. ఇందులో మహారాష్ట్ర వాటా 67.36 గిగావాట్లు, గుజరాత్ వాటా 33.36 గిగావాట్లు. దక్షిణ ప్రాంతంలో 97.76 గిగావాట్లు, తూర్పు ప్రాంతంలో 53.41 గిగావాట్లు, ఉత్తర ప్రాంతంలో 50.32 గిగావాట్లు, ఈశాన్య ప్రాంతంలో 14.18 గిగావాట్ల సామర్థ్యం గుర్తించారు. దక్షిణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు కీలకంగా ఉన్నాయి.
CEA ప్రణాళిక ప్రకారం 2035-36 నాటికి దేశంలో పంప్డ్ స్టోరేజ్ సామర్థ్యం 105.56 గిగావాట్లకు చేరుకోవచ్చు. 2024-25 వరకు అందుబాటులో ఉన్న 4.745 గిగావాట్ల సామర్థ్యానికి, 2025-26లో మరో 2.68 గిగావాట్లు జత కావడంతో మొత్తం 7.425 గిగావాట్లకు చేరింది. ఆ తర్వాతి సంవత్సరాల్లోనూ కొత్త ప్రాజెక్టుల ద్వారా సామర్థ్యాన్ని పెంచాలని ప్రణాళిక రూపొందించారు.
పంప్డ్ స్టోరేజ్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఉపయోగిస్తున్న భారీ విద్యుత్ నిల్వ విధానాల్లో ఒకటి. IRENA గణాంకాల ప్రకారం, 2025 చివరి నాటికి ప్రపంచ స్థాపిత సామర్థ్యం 159.8 గిగావాట్లుగా ఉంది. చైనా సుమారు 66 గిగావాట్లతో మొదటి స్థానంలో ఉండగా, జపాన్ 22 గిగావాట్లు, అమెరికా 19 గిగావాట్ల సామర్థ్యంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ 7.18 గిగావాట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 2026లో దేశ సామర్థ్యం 7.43 గిగావాట్లకు పెరిగింది.
ఈ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. 2023 ఏప్రిల్‌లో ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు, రోడ్లు, వంతెనలు, రైల్వే సైడింగ్‌లు, విద్యుత్ ప్రసార లైన్ల వంటి మౌలిక సదుపాయాలకు మద్దతు అందిస్తోంది. 2025 ఫిబ్రవరిలో టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్ మార్గదర్శకాలను ప్రకటించింది. 2028 జూన్ 30లోపు నిర్మాణ ఒప్పందాలు పొందిన అర్హతగల ప్రాజెక్టులకు 25 ఏళ్ల పాటు 100 శాతం అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీల మినహాయింపు కల్పించే విధానాన్ని తీసుకొచ్చింది. అలాగే ప్రాజెక్టుల వివరణాత్మక నివేదికల ఆమోద సమయాన్ని 90 రోజుల నుంచి 50 రోజులకు తగ్గించింది.
నవంబర్ 2 నుంచి 5 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు, ఎక్స్పో 2026లో కూడా ఇంధన నిల్వ కీలక అంశంగా ఉంది. 130కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో సౌర, పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్, గ్రిడ్ అనుసంధానం, నిల్వ సాంకేతికతలపై చర్చలు జరుగుతున్నాయి.
