Last Updated:
Traffic Challans: పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్ల వసూళ్లపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. దేశవ్యాప్తంగా చెల్లించని ఈ-చలాన్ల విలువ భారీగా ఉన్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా రికవరీ చేసేందుకు కొత్త మార్గాలను పరిశీలించాలని ధర్మాసనం పేర్కొంది. ఇందులో భాగంగా పెండింగ్ చలాన్లను విద్యుత్ బిల్లులతో అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది.
Traffic Challans: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన తర్వాత జారీ చేసిన ఈ-చలాన్లు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచుతున్న వాహనదారులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా చెల్లించని ట్రాఫిక్ ఈ-చలాన్ల నుంచి భారీ మొత్తంలో జరిమానాలు రికవరీ చేయాల్సి ఉందని కోర్టు దృష్టికి వచ్చింది. ఈ బకాయిలను ఎలా వసూలు చేయాలనే అంశంపై విచారణ సందర్భంగా, పెండింగ్ చలాన్లను విద్యుత్ బిల్లులతో అనుసంధానం చేసే అవకాశాన్ని సుప్రీంకోర్టు సూచించింది.
జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది. పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ చలాన్లు జారీ చేస్తున్నప్పటికీ, వాటి ద్వారా విధించిన జరిమానాలను పూర్తిస్థాయిలో రికవరీ చేయడం లేదని కోర్టుకు తెలియజేశారు. కేవలం ఈ-చలాన్లు జారీ చేయడం వల్ల ప్రయోజనం లేదని, వాటి ద్వారా విధించిన జరిమానాలను వాస్తవంగా వసూలు చేయడం కూడా అంతే ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ-చలాన్ల రూపంలో దాదాపు రూ.45,000 కోట్ల బకాయిలు ఉన్నట్లు కోర్టుకు సమాచారం అందింది. ఇందులో ఇప్పటివరకు సుమారు రూ.25,000 కోట్లు రికవరీ చేసినట్లు అధికారులు వివరించారు. అంటే ఇంకా దాదాపు రూ.20,000 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. ఈ భారీ మొత్తాన్ని రికవరీ చేయడానికి మరింత సమర్థవంతమైన విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలోనే చెల్లించని ట్రాఫిక్ చలాన్లను విద్యుత్ బిల్లులతో అనుసంధానం చేసే అంశాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. “ప్రజలు ట్రాఫిక్ చలాన్లు చెల్లించకపోతే, దానిని వారి విద్యుత్ బకాయిల బిల్లుకు జోడించండి. వారు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే విద్యుత్ లైన్ డిస్‌కనెక్ట్ అవుతుంది. ఒక మార్గాన్ని కనుగొనాలి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది కోర్టు సూచన మాత్రమేనని, అమల్లోకి వచ్చిన నిబంధనగా భావించకూడదు. అదే సమయంలో, చెల్లించని ఈ-చలాన్లను గుర్తించేందుకు పరివాహన్ పోర్టల్‌లో వాహనాలను బ్లాక్‌లిస్ట్ చేయడం వంటి చర్యలను కూడా పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇలాంటి వాహనాల యాజమాన్య బదిలీలను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకోవచ్చని కూడా కోర్టు అభిప్రాయపడింది. చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాలపై వ్యవస్థలోనే కొన్ని పరిమితులు విధించడం ద్వారా జరిమానాల వసూళ్లు మెరుగుపడే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ అంశాలను ప్రస్తావించింది.
ఒక వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు దానిపై జారీ చేసిన ఈ-చలాన్ చెల్లించలేదని గుర్తిస్తే, చట్టానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకునే విధానాన్ని పరిశీలించాలని ధర్మాసనం పేర్కొంది. అవసరమైతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే చర్యలు కూడా చట్టపరమైన నిబంధనల ప్రకారం చేపట్టవచ్చని సూచించింది. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు కేవలం చలాన్ల వసూళ్లకే పరిమితం కావడం లేదు. దేశంలో రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలు, ప్రమాదాల తర్వాత బాధితులకు అందాల్సిన సహాయం వంటి అంశాలకు సంబంధించిన సమగ్ర వ్యవస్థాగత సంస్కరణలపై కోర్టు విచారణ కొనసాగిస్తోంది.

