Last Updated:
గురక అనేది నిద్రలో వాయువు మార్గం పాక్షికంగా మూసుకుపోవడం వల్ల కలిగే శబ్దం. వరంగల్ నగరంలోని పల్లవి హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పవన్ గురక రావడానికి గల కారణాలను, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
రాత్రి పడుకోగానే పక్కనున్న వారిని నిద్రపోనివ్వకుండా రాంపపు కోత కోస్తున్నారా? ఇంట్లో వాళ్లు మీ గురక శబ్దానికి భయపడి వేరే గదిలోకి పారిపోతున్నారా? అయితే మీరు వెంటనే అప్రమత్తం కావాల్సిందే! గురక కేవలం పక్కవారి నిద్రను చెడగొట్టే ఒక సాధారణ శబ్దం మాత్రమే కాదు.. అది మీలో దాగి ఉన్న తీవ్రమైన ఆరోగ్య సమస్యకు ఒక ప్రమాద ఘంటిక. ప్రతి పదిమందిలో ఒకరు ఈ గురక సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసలు ఈ గురక ఎందుకు వస్తుందనే దానికి వరంగల్ నగరంలోని పల్లవి హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పవన్ స్పష్టమైన వివరణ ఇచ్చారు. నిద్రపోతున్న సమయంలో గాలి వెళ్లే మార్గం పాక్షికంగా మూసుకుపోవడం వల్ల ఈ శబ్దం వస్తుందని ఆయన తెలిపారు. శ్వాస తీసుకునేటప్పుడు గొంతు, ముక్కు వెనుక భాగంలో ఉండే మృదువైన కణజాలాలు వణకడం వల్ల ఇలాంటి వింత శబ్దాలు ఉత్పన్నమవుతాయి. గాలి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడినప్పుడే ఈ ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుందని డాక్టర్ పవన్ విశ్లేషించారు.
గురక రావడానికి మన దైనందిన జీవితంలో చేసే పలు పొరపాట్లే ప్రధాన కారణం. వెల్లకిలా పడుకోవడం వల్ల నాలుక, కొండనాలుక వెనుకకు జారి శ్వాస మార్గానికి అడ్డుపడతాయి. అధిక బరువు ఉన్నవారిలో మెడ, గొంతు భాగంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు వల్ల శ్వాసనాళాలు కుంచించుకుపోయి గాలి ప్రవాహం తగ్గుతుంది. పడుకునే ముందు మద్యం సేవించడం, నిద్రమాత్రలు వాడటం వల్ల గొంతు కండరాలు అతిగా రిలాక్స్ అయి గాలికి అడ్డుకట్ట వేస్తాయి. ముక్కు మధ్య ఉండే ఎముక వంకరగా ఉండటం, టాన్సిల్స్ పెద్దగా ఉండటం, వయసు పెరిగే కొద్దీ గొంతు కండరాలు బిగువు తగ్గడం లాంటివి గురకకు దారితీస్తాయి.
ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. వెల్లకిలా పడుకోవడానికి బదులుగా ఎప్పుడూ పక్కకు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. బరువు ఎక్కువగా ఉన్నవారు సరైన వ్యాయామంతో బరువును అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. నిద్రించేటప్పుడు మంచం తల వైపు భాగాన్ని సుమారు నాలుగు అంగుళాలు పైకి ఎత్తడం, గురకను తగ్గించే ప్రత్యేకమైన దిండ్లు వాడటం వల్ల గాలి ప్రవాహం మెరుగుపడుతుంది. ముక్కుదిబ్బడ లేదా ఎలర్జీ సమస్యలు ఉన్నప్పుడు వైద్యుల సలహాతో నాసిక స్ట్రిప్స్, స్ప్రేలు వాడటం ఎంతో మేలు చేస్తుంది.
శరీరంలో తగినంత నీరు లేకపోతే గొంతులోని స్రావాలు చిక్కబడి గురక తీవ్రమవుతుంది కాబట్టి, రోజూ పుష్కలంగా నీరు తాగాలి. ఆహారపు అలవాట్లలో సైతం మార్పులు చేసుకోవాలి. తీపి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఫైబర్, ప్రోటీన్ నిండిన ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి పూట వేపుళ్లు, ఫాస్ట్ ఫుడ్స్ పక్కనపెట్టి తేలికపాటి ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. జీవనశైలిలో ఈ చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా గురకను సులభంగా జయించవచ్చు. ఈ జాగ్రత్తలు పాటించినా గురక తీవ్రత తగ్గకపోతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
