Last Updated:
భారత సముద్ర జలాల్లో మన నౌకాదళ శక్తిని మరింత పెంచే కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకపై ఫ్రాన్స్‌కు చెందిన అత్యాధునిక రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ తొలిసారిగా విజయవంతంగా ల్యాండింగ్ అయింది.
భారత నౌకాదళం మరో కీలక ఘనత సాధించింది. దేశీయంగా నిర్మించిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ మెరైన్ యుద్ధవిమానం తొలిసారిగా విజయవంతంగా ల్యాండింగ్ అయింది. ఈ పరిణామంతో భారత నౌకాదళంలో రఫేల్ మెరైన్ యుద్ధవిమానాల ప్రవేశానికి మరో కీలక అడుగు పడింది. సముద్రంపై నుంచి శత్రువులపై దాడులు చేయడంతో పాటు గగనతల రక్షణ సామర్థ్యాలను పెంచుకునేందుకు ఈ పరిణామం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత నౌకాదళం విడుదల చేసిన వీడియోలో రఫేల్ మెరైన్ యుద్ధవిమానం ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వేదికపైకి విజయవంతంగా దిగిన దృశ్యాలు కనిపించాయి. అత్యంత వేగంతో వచ్చి విమాన వాహక నౌకపై సురక్షితంగా దిగడం, ప్రత్యేక వ్యవస్థ సాయంతో విమానాన్ని నిలిపివేయడం వంటి ప్రక్రియలను ఈ పరీక్షలో పరిశీలించారు. ఈ విజయంతో రఫేల్ మెరైన్ విమానానికి, భారతదేశం స్వయంగా నిర్మించిన విమాన వాహక నౌకకు మధ్య సాంకేతిక అనుసంధానం సాధ్యమవుతుందని నిరూపితమైంది. షార్ట్ టేకాఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ (STOBAR) విధానంలో విమానాల నిర్వహణకు ఇది ముఖ్యమైన ముందడుగు.
ఈ ల్యాండింగ్‌కు ముందు విమానానికి సంబంధించిన పలు సాంకేతిక అంశాలను నిపుణులు పరీక్షించారు. సముద్ర వాతావరణంలో ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకునేలా విమానంలో చేసిన మార్పులు ఇందులో కీలకం. ముఖ్యంగా బలోపేతం చేసిన ల్యాండింగ్ గేర్లు, ప్రత్యేకంగా రూపొందించిన ల్యాండింగ్ హుక్, మడతపెట్టే రెక్కల పనితీరును పరిశీలించారు. నౌకాదళ పరీక్షా పైలట్లు, ఇంజినీర్లు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు.
ఐఎన్ఎస్ విక్రాంత్‌లో విమానాలు గాలిలోకి ఎగిరేందుకు స్కీ జంప్ ర్యాంప్ ఉంటుంది. అదే సమయంలో దిగే విమానాలను ఆపేందుకు స్టీల్ అరెస్టర్ వైర్లను ఉపయోగిస్తారు. అధిక వేగంతో వచ్చే రెండు ఇంజిన్లు కలిగిన రఫేల్ మెరైన్ విమానం ఈ వ్యవస్థకు అనుగుణంగా పనిచేయడం అత్యంత అవసరం. భవిష్యత్తులో నిరంతర కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ పరీక్షలు పునాది కానున్నాయి.
రఫేల్ మెరైన్ యుద్ధవిమానాల కొనుగోలు భారత నౌకాదళ ఆధునికీకరణ ప్రణాళికలో కీలక భాగం. వీటిలో అధునాతన ఏఈఎస్ఏ రాడార్ వ్యవస్థలు, గగనతలంలో శత్రు విమానాలను ఎదుర్కొనే మెటియోర్ క్షిపణులు, లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే మార్గదర్శక ఆయుధాలు ఉంటాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ రక్షణ, దాడి సామర్థ్యాలను పెంచడంలో ఈ యుద్ధవిమానాలు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం అనుసంధాన పరీక్షలు కొనసాగుతుండగా, తాజా విజయంతో భవిష్యత్తులో రఫేల్ మెరైన్ విమానాల అధికారిక ప్రవేశం, నౌకాదళంలో వాటి మోహరింపునకు మార్గం సుగమమైంది.

