Last Updated:
ఏఐ+ రూ.100 కోట్లతో బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ప్రారంభించింది. వినియోగదారులకు సురక్షితమైన అనుభవం అందించడమే లక్ష్యం.
భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఏఐ+ తన డివైజ్‌ల భద్రతను మరింత బలోపేతం చేయడానికి భారీ అడుగు వేసింది. వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.100 కోట్లతో బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. దీంతో సెక్యూరిటీ లోపాలను ముందుగానే గుర్తించి, వినియోగదారులకు మరింత సురక్షితమైన అనుభవం అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని పీటీఐ కథనం వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా స్వతంత్ర సెక్యూరిటీ రీసెర్చర్లు, డెవలపర్లు కంపెనీ సిస్టమ్‌లను పరీక్షించవచ్చు. అలాగే సెక్యూరిటీ ఆర్కిటెక్చర్‌ను పరిశీలించి, అందులో ఉన్న బలహీనతలను గుర్తించి కంపెనీ దృష్టికి తీసుకురావచ్చు. వినియోగదారులపై ప్రభావం పడకముందే అలాంటి లోపాలను సరిచేసే అవకాశం ఈ కార్యక్రమం కల్పిస్తుందని ఏఐ+ తెలిపింది.
కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, వచ్చే ఐదేళ్ల పాటు ప్రతి ఏడాది రూ.20 కోట్లు కేటాయించనుంది. ఇలా మొత్తం రూ.100 కోట్లతో టెక్నాలజీ, డెవలపర్ కమ్యూనిటీని భాగస్వామ్యం చేసుకుని తమ డివైజ్‌ల భద్రతను మరింత మెరుగుపరచడంతో పాటు వినియోగదారుల నమ్మకాన్ని పెంచాలని కంపెనీ భావిస్తోంది. సెప్టెంబర్ 2025లో ప్రారంభమైన ఏఐ+ తొలి ఆర్థిక సంవత్సరంలోనే రూ.965 కోట్ల ఆదాయం సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయాన్ని అనేక రెట్లు పెంచి రూ.7,500 కోట్లకు పైగా తీసుకెళ్లాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ సాధారణంగా ఉండే కార్యక్రమాల కంటే భిన్నంగా ఉంటుందని ఏఐ+ తెలిపింది. డెవలపర్లు, సెక్యూరిటీ రీసెర్చర్లు, ఎథికల్ హ్యాకర్లు కలిసి పనిచేసే ఓపెన్ వాతావరణాన్ని సృష్టించి, ఏఐ+ ఉత్పత్తులను మరింత సురక్షితంగా, నమ్మకంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొంది. ఎన్ఎక్స్టీక్వాంటమ్ షిఫ్ట్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఏఐ+ స్మార్ట్‌ఫోన్ సీఈవో మాధవ్ శేఠ్ మాట్లాడుతూ, చాలా కంపెనీలు తమ డివైజ్‌లు సురక్షితమని వినియోగదారులకు చెబుతాయని అన్నారు.
“మేము అది నిజమే అని నిరూపించాలనుకుంటున్నాం. ఏ స్మార్ట్‌ఫోన్ అయినా, ఏ ప్లాట్‌ఫామ్ అయినా, ఏ టెక్నాలజీ ఎకోసిస్టమ్ అయినా భద్రత పూర్తిగా సాధించేశామని చెప్పలేం. ట్రస్ట్‌ను పారదర్శకంగా, అందరూ కలిసి నిర్మించాలనే మా నమ్మకానికే ప్రాజెక్ట్ ట్రస్ట్+ నిదర్శనం” అని ఆయన చెప్పారు. భారత టెక్నాలజీ కమ్యూనిటీకి తమ తలుపులు తెరిచామని మాధవ్ శేఠ్ తెలిపారు. అత్యంత సురక్షితమైన ఉత్పత్తులు ఒంటరిగా తయారుకావని, డెవలపర్లు, సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులు కలిసి పనిచేసినప్పుడే అవి మరింత బలంగా తయారవుతాయని తమ నమ్మకం అని ఆయన వివరించారు.
Hyderabad,Telangana
Aug 06, 2026 12:34 PM IST

