Last Updated:
స్టార్ హీరో దళపతి విజయ్ వారసుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమైన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘సిగ్మా’ (Sigma). అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇదే నెలలో ఓటీటీ లోకి వస్తుడటం విశేషం.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ వారసుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమైన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘సిగ్మా’ (Sigma). వైవిధ్యమైన కథలను ఎంచుకునే టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్ హీరోగా, ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలో భారీ అంచనాల నడుమ విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా కాస్త వెనుకబడింది. ఇప్పుడు ఈ యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. అక్టోబర్ 30 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో హీరో గురు (సందీప్ కిషన్) తన తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన ఒక పాత లైబ్రరీని నడుపుతూ ఉంటాడు. అదే సమయంలో యూట్యూబ్‌లో స్టోరీ టెల్లర్గా ఫేమస్ కావాలని కలలు కంటుంటాడు. కానీ, తండ్రి చేసిన అప్పుల భారం అతన్ని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతుంది. పరిస్థితులు చేయిదాటిపోయి తన ఇంటిని కాపాడుకునేందుకు కేవలం ఒక్క రాత్రిలో రూ.1.25 కోట్లు చెల్లించాల్సిన కఠిన పరిస్థితి ఎదురవుతుంది. ఆ డబ్బును ఎలాగైనా సంపాదించాలని గురు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో, అతనికి ఒక పెన్‌డ్రైవ్ దొరుకుతుంది. అందులో క్యాసినో, డ్రగ్స్ దందా చేస్తూ అమాయకుల డబ్బును దోచుకుంటున్న క్రూరమైన గ్యాంగ్‌స్టర్ విన్సెంట్ (శివ్ పండిట్) నేరాలకు సంబంధించిన కీలక ఆధారాలు ఉంటాయి.
ఆ పెన్‌డ్రైవ్‌ను అడ్డుపెట్టుకుని విన్సెంట్‌ను బ్లాక్మెయిల్ చేసి, తనకు కావాల్సిన రూ.1.25 కోట్లు వసూలు చేయాలని గురు ఓ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో కథలో ఊహించని మలుపు చోటుచేసుకుంటుంది. ఏకంగా రూ.1000 కోట్ల భారీ నిధికి సంబంధించిన లాకర్ తాళాన్ని వెతుక్కుంటూ ఇంటర్నేషనల్ మాఫియా డాన్ వీరయ్య రెడ్డి (సంపత్ రాజ్) రంగంలోకి దిగుతాడు. వీరయ్య రెడ్డి రాకతో గురు ప్లాన్ ఏమైంది? అసలు ఆ వెయ్యి కోట్లకు, ఈ పెన్ డ్రైవ్‌కు ఉన్న సంబంధం ఏంటి? ప్రాణాపాయంలో చిక్కుకున్న గురు ఆ మాఫియా ముఠాల నుంచి తనను తాను ఎలా కాపాడుకున్నాడు? చివరకు తన ఇంటిని దక్కించుకున్నాడా లేదా? అనేది ఉత్కంఠభరితంగా సాగే మిగతా కథ.

