Last Updated:
ఘనంగా ‘స్కాలర్’ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ.. డ్రగ్స్, గంజాయి సమస్యపై సందేశాత్మక చిత్రం
డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఘనంగా ‘స్కాలర్’ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ.. డ్రగ్స్, గంజాయి సమస్యపై సందేశాత్మక చిత్రం
డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్యపై అవగాహన కల్పించడంతో పాటు, యువతను మత్తు పదార్థాల ప్రభావం నుంచి బయటకు తీసుకురావాలనే సందేశంతో ఓ కొత్త సినిమా తెరకెక్కుతోంది. అదే ‘స్కాలర్’. కౌశిక్, ప్రతిభా సిన్హా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిల్డ్రన్స్ డే సందర్భంగా ఘనంగా ఆవిష్కరించారు.
శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలిమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో, పొగాకు శిరీష మహేష్ (న్యూజెర్సీ, యూఎస్ఏ) సౌజన్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధాకర్ గౌడ్, పెంచల్ రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో పలు సందేశాత్మక బాలల చిత్రాలను రూపొందించిన డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యూత్‌ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా, సామాజిక సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం చాంబర్ వేదికగా ‘స్కాలర్’ ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బి.జి.ఆర్ మైనింగ్ డైరెక్టర్ బాలకోటి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూబ్లీహిల్స్ క్లబ్ ప్రెసిడెంట్ చక్రవర్తి రెడ్డి, రామకృష్ణారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ పెంచల్ రెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిపారు. యువత ఈ మహమ్మారి బారిన పడకుండా ఎలా రక్షించాలి? ఒకవేళ మత్తు పదార్థాలకు బానిసలైతే వారిని తిరిగి సాధారణ జీవితంలోకి ఎలా తీసుకురావాలి? అనే విషయాలను కథలో చూపించనున్నట్లు వివరించారు.
ఓ యువకుడు డ్రగ్స్‌కు బానిసలైన వారిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రత్యేకమైన డ్రగ్‌ను కనిపెడతాడని, దాంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదిస్తాడని దర్శకుడు వెల్లడించారు. అయితే ఈ ఆవిష్కరణ డ్రగ్ మాఫియాకు అడ్డంకిగా మారుతుంది. దీంతో మాఫియా అతని కుటుంబాన్ని, చెల్లెలిని అంతం చేస్తుంది. ఆ తర్వాత ఆ యువకుడు స్పిరిచ్యువల్ బ్యాక్‌డ్రాప్‌లో డ్రగ్ మాఫియాపై ఎలా పోరాటం సాగించాడు? దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా వారిని ఎలా అంతం చేశాడు? అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. ఈ కథలో సందేశంతో పాటు కమర్షియల్ అంశాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు.
త్వరలోనే సినిమా షూటింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని దర్శకుడు తెలిపారు. ఇదిలా ఉంటే, చిల్డ్రన్స్ డే వేడుకల్లో భాగంగా ఫిలింనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు ఇతర పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులను సత్కరించారు. వారికి మెమెంటోలు, గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. ‘స్కాలర్’ ఫస్ట్ లుక్ వేడుకతో పాటు విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం విశేషంగా నిలిచింది.

