Last Updated:
టాలీవుడ్‌లో కొన్ని పాత్రలు, వాటిని పోషించిన నటీనటుల పేర్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి అరుదైన పాత్రల్లో రమ్యకృష్ణ నటించిన నీలాంబరి, శివగామి పాత్రలు ముందు వరుసలో ఉంటాయి.
టాలీవుడ్‌లో కొన్ని పాత్రలు, వాటిని పోషించిన నటీనటుల పేర్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి అరుదైన పాత్రల్లో రమ్యకృష్ణ నటించిన నీలాంబరి, శివగామి పాత్రలు ముందు వరుసలో ఉంటాయి. రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘నరసింహ’ సినిమాలో నీలాంబరిగా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె.. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’లో శివగామిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. అయితే తన కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచిన ఈ రెండు పాత్రలను చేయడానికి మొదట్లో రమ్యకృష్ణ అస్సలు ఆసక్తి చూపించలేదట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయాలను వెల్లడించారు. ఆ పాత్రలను మొదట ఎందుకు వద్దనుకున్నారో వివరించారు.
‘నరసింహ’ సినిమాలో నీలాంబరి పాత్ర తన దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఆలోచించానని రమ్యకృష్ణ తెలిపారు. అప్పటికే ‘అమ్మోరు’ సినిమాతో సౌందర్య మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస విజయాలతో దూసుకుపోతున్నారని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఇండస్ట్రీలో నెంబర్ వన్, నెంబర్ టూ అనే పోటీ గురించి ఎక్కువగా చర్చ జరిగేదని చెప్పారు. తాను అలాంటి పోటీలను పెద్దగా పట్టించుకోకపోయినా, చుట్టూ ఉన్నవారు మాత్రం వాటి గురించే మాట్లాడేవారని అన్నారు.
అలాంటి సమయంలో సౌందర్యకు వ్యతిరేకంగా నెగెటివ్ పాత్రలో నటించే అవకాశం రావడంతో మొదట ఇబ్బందిగా అనిపించిందని రమ్యకృష్ణ చెప్పారు. తన కళ్ల ముందే ఎదుగుతున్న హీరోయిన్‌కు తాను విలన్‌గా నటించాలా? అనే ఆలోచన వచ్చిందని తెలిపారు. పైగా ఎంత బాగా రాసిన పాత్ర అయినా చివరకు హీరో, హీరోయిన్లకే ఎక్కువ గుర్తింపు వస్తుందని, విలన్ పాత్రకు మూడో లేదా నాలుగో స్థానం మాత్రమే దక్కుతుందని అప్పట్లో భావించానని చెప్పారు. అందుకే మొదట్లో ఇష్టం లేకుండానే షూటింగ్‌కు వెళ్లేదాన్నని వెల్లడించారు. అయితే కెమెరా ముందుకు వెళ్లిన తర్వాత మాత్రం తన నటనకు వంద శాతం న్యాయం చేశానని, అదే నీలాంబరి పాత్రను ప్రేక్షకుల మనసుల్లో నిలిపిందని వివరించారు. దీనిపై పలువురు పలు విధాలుగా స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా తన కళ్ల ముందే ఎదుగుతున్న హీరోయిన్ అంటూ అనడం కుళ్లులా ఉంది అనుకుంటున్నారు. అయితే మరికొందరు మాత్రం రమ్యకృష్ణ అలా అనలేదని.. క్యాజువల్‌గా అందని మాట్లాడుకుంటున్నారు.
ఇక ‘బాహుబలి’ సినిమా విషయంలోనూ ఇలాంటి ఆసక్తికర సంఘటన జరిగిందని రమ్యకృష్ణ తెలిపారు. ఆ సమయంలో తాను టీవీ సీరియల్స్ నిర్మాణంలో బిజీగా ఉన్నానని చెప్పారు. ప్రతి నెలా ఎపిసోడ్స్ పూర్తి చేయడం, టీఆర్పీల ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు ఇలా చాలా పనులతో తీరిక లేకుండా ఉండేదాన్నని వెల్లడించారు.
అప్పుడే నిర్మాత శోభు యార్లగడ్డ ఫోన్ చేసి ‘బాహుబలి’ సినిమా కోసం 40 రోజుల కాల్షీట్లు కావాలని అడిగారట. తనకు అంత సమయం లేదని, 40 రోజులు కేటాయించడం అసాధ్యమని చెప్పి ఫోన్ పెట్టేశానని రమ్యకృష్ణ గుర్తుచేసుకున్నారు. అప్పటికి కనీసం సినిమా కథ కూడా వినలేదని తెలిపారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న తన తండ్రి తీవ్రంగా మందలించారని చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా, పైగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారని తెలిసి కూడా ఎందుకు తిరస్కరించావని ప్రశ్నించారట. ఆ తర్వాత శోభు యార్లగడ్డ మరోసారి సంప్రదించి కథ వినాలని కోరడంతో రాజమౌళిని కలిశానని తెలిపారు.

