Last Updated:
ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, సీనియర్ నటుడు అనంత్ నాగ్ అవార్డుల ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014కు ముందు జాతీయ అవార్డుల్లో ఆశ్రిత పక్షపాతం ఉండేదని, ప్రధాని మోదీ వచ్చాకే ఆ వ్యవస్థ మారిందని ఆయన ప్రశంసించారు.
భారతీయ చలనచిత్ర రంగానికి ఐదు దశాబ్దాలకు పైగా చేసిన విశేష సేవలకు గాను 2024వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన సీనియర్ నటుడు అనంత్ నాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో సినిమా అవార్డుల ఎంపికలో ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి విపరీతంగా ఉండేవని ఆయన ఆరోపించారు. 2014కు ముందు జాతీయ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డుల జ్యూరీలో ఎవరుంటారో కూడా ఎవరికీ తెలిసేది కాదని విమర్శించారు. ఎవరైనా ఈ వ్యవస్థను ప్రశ్నించినా సమాధానం చెప్పేవాళ్లే ఉండేవారు కాదన్నారు.
అయితే, 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఈ వ్యవస్థ పూర్తిగా మారిపోయిందని ఆయన కొనియాడారు. ఇప్పుడు అవార్డుల ఎంపికలో పారదర్శకత వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాను ఎప్పుడూ అవార్డుల కోసం నటించలేదని, ప్రేక్షకుల కరతాళ ధ్వనులే తనకు అసలైన బహుమతి అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 22న కెవాడియాలో జరిగే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు.
నిజానికి నటుడు కావడం తన అసలు లక్ష్యం కాదని అనంత్ నాగ్ వెల్లడించారు. దేశభద్రతా దళాల్లో చేరాలన్నది తన చిన్ననాటి కల అని చెప్పారు. అయితే ఎడమ కంటి చూపు మందగించడం వల్ల ఎయిర్‌ఫోర్స్ అధికారులు తనను తిరస్కరించారని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ఆర్మీలో చేరడానికి ప్రయత్నిస్తే, ఉండాల్సిన బరువు కంటే 10 పౌండ్లు తక్కువగా ఉన్నానని అక్కడా అవకాశం దక్కలేదన్నారు. ఆ తర్వాత నాటకాల్లో అవకాశం రావడంతో నటుడిగా మారి వెనక్కి తిరిగి చూసుకోలేదని వివరించారు.
కన్నడ, హిందీతో పాటు అనేక భాషల్లో అద్భుతమైన చిత్రాలు చేసిన ఆయన, మూడేళ్ల క్రితమే నటనకు స్వస్తి పలికారు. ప్రస్తుత తరం దర్శకుల ఆలోచనా విధానం వేరుగా ఉందని, వందల కొద్దీ కథలు విన్నా తనకు సరిపోయే పాత్ర ఒక్కటి కూడా దొరకలేదని ఆయన చెప్పారు. స్క్రిప్ట్‌లు చదివిన తర్వాత అక్కడ తన అవసరం లేదనిపించి నటన నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేశారు.
ప్రస్తుతం 78 ఏళ్ల వయసున్న అనంత్ నాగ్ తన సమయాన్ని ఎక్కువగా ధ్యానానికే కేటాయిస్తున్నారు. గతాన్ని తవ్వుకోవడం కంటే ముందుకు సాగడమే ఉత్తమమైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఫాల్కే అవార్డు రావడం పట్ల తన సోదరుడు, దివంగత దర్శకుడు శంకర్ నాగ్ బతికి ఉంటే ఎంతో సంతోషించేవారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

