Last Updated:
Mutual Funds | మ్యూచువల్ ఫండ్స్ అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్‌లో తెలుగు రాష్ట్రాలు కీలకంగా నిలుస్తున్నాయి. రూ.2.95 లక్షల కోట్ల ఏయూఎంతో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వృద్ధిలో కీలకంగా మారాయి.
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వృద్ధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వాములుగా నిలుస్తున్నాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) వెల్లడించింది. సంస్థ గణాంకాల ప్రకారం మ్యూచువల్ ఫండ్ అసెట్స్‌లో ఈ రెండు రాష్ట్రాల వాటా రూ.2.95 లక్షల కోట్లుగా ఉంది. అలాగే క్రమశిక్షణ, దీర్ఘకాలిక ఇన్వెస్టింగ్‌కి ప్రాధాన్యమిచ్చే ధోరణిని సూచిస్తూ సిప్ విధానంలో పెట్టుబడులు పెరుగుతుండటాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2025 జూలైతో పోలిస్తే 2026 జూలైలో తెలంగాణలో మ్యూచువల్ ఫండ్ ఏయూఎం 19 శాతం వృద్ధి చెంది రూ.2,12,856 కోట్లకు చేరింది. భారతదేశపు మొత్తం మ్యూచువల్ ఫండ్ అసెట్స్‌లో సుమారు 2.5 శాతం వాటాతో మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడాన్ని సూచిస్తూ ఫోలియోల సంఖ్య 82.24 లక్షలకి చేరింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఫోలియోల్లో ఇది సుమారు 2.9 శాతం.
2025 జూలైతో పోలిస్తే 2026 జూలైలో ఆంధ్రప్రదేశ్‌లో మ్యూచువల్ ఫండ్ ఏయూఎం 23 శాతం వృద్ధి చెంది రూ.82,409 కోట్లకు చేరింది. ఇది భారతదేశపు మ్యూచువల్ ఫండ్ అసెట్స్‌లో సుమారు 1 శాతం వాటాకు సమానం. 79.44 లక్షల పైగా ఫోలియోల సంఖ్యతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో రాష్ట్రం 15వ స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రూ.1,84,261 కోట్ల ఏయూఎంతో హైదరాబాద్ అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ కేంద్రంగా నిలుస్తోంది. మొత్తం రాష్ట్ర ఏయూఎంలో ఇది 87 శాతానికి సమానం. 2025 జూలైతో పోలిస్తే హైదరాబాద్ ఏయూఎం 18 శాతం వృద్ధి చెందింది. భారత్‌లోని టాప్ 30 నగరాల్లో హైదరాబాద్ 8వ స్థానంలో ఉంది. దేశ మ్యూచువల్ ఫండ్ అసెట్స్‌లో 2.10 శాతం వాటా కలిగి ఉంది. హైదరాబాద్‌లో 54.44 లక్షల ఫోలియోలు ఉన్నాయి. ఇది తెలంగాణలోని మొత్తం ఫోలియోల్లో 66.2 శాతానికి సమానం.
ఆంధ్రప్రదేశ్‌లో రూ.16,614 కోట్ల ఏయూఎంతో విశాఖపట్నం అగ్రస్థానంలో ఉంది. మొత్తం రాష్ట్ర ఏయూఎంలో ఇది దాదాపు అయిదో వంతు. రూ.8,337 కోట్లతో విజయవాడ, ఆ తరువాత స్థానంలో ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే ధోరణి ఒకే పట్టణ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా మిగతా ప్రాంతాల్లోను గణనీయంగా విస్తరిస్తున్నదని ఈ రెండు నగరాల్లో తీరుతెన్నులు తెలియజేస్తున్నాయి. “ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం నుంచే రాష్ట్ర మొత్తం AUM లో 20% వరకు వస్తుంది. తిరుపతి వంటి మిగతా నగరాల వాటా చాలా తక్కువ. అందుకే అక్కడ విస్తరణపై దృష్టి పెడుతున్నాం. విశాఖపట్నం ఐఐఎంలో ‘ట్రైన్ ది ట్రైనర్స్’ ద్వారా 54 మంది లెక్చరర్లకు శిక్షణ ఇచ్చాం, వారు మరో 10,000 మందికి అవగాహన కల్పించారు. ఏపీలో 20,000 నుంచి 30,000 మంది డిస్ట్రిబ్యూటర్లను తయారు చేయాలని చూస్తున్నాం” అని వెంకట్ ఎన్. చలసాని చెప్పారు.
రెండు రాష్ట్రాల్లోనూ పెట్టుబడులకు సంబంధించి సిప్‌లు కీలకంగా ఉంటున్నాయి. తెలంగాణలో 26.09 లక్షల పైగా సిప్ ఫోలియోలతో సిప్ ఏయూఎం రూ.47,975 కోట్లుగా నమోదైంది. ఇది మొత్తం రాష్ట్ర ఏయూఎంలో 22 శాతం. ఆంధ్రప్రదేశ్‌లో 26.47 లక్షల సిప్ ఫోలియోలతో సిప్ ఏయూఎం రూ.26,820 కోట్లుగా ఉంది. ఇది మొత్తం రాష్ట్ర ఏయూఎంలో 32 శాతం. మార్కెట్ టైమింగ్‌పై ఆధారపడటం కాకుండా సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ ద్వారా నిలకడగా పెట్టుబడులు పెట్టే ధోరణులను ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
పెట్టుబడులు పెట్టే మదుపరుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. తెలంగాణలో 19.60 లక్షల పైచిలుకు మదుపరులు ఉండగా, వీరిలో 24.42 శాతం మంది మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 20.94 లక్షల మంది మదుపరులు ఉండగా, వీరిలో 23.60 శాతం మంది మహిళలు ఉన్నారు. ఈ విషయంలో జాతీయ సగటు 26.74 శాతంగా ఉంది. తదుపరి రోజుల్లో పెట్టుబడులు మరింతగా విస్తరించడానికి ఇక్కడి ఆర్థిక పరిస్థితులు గణనీయంగా తోడ్పాటు అందించనున్నాయి. 2025-26లో తెలంగాణ జీడీపీ రూ.17.82 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది దేశ జీడీపీలో 5.0 శాతానికి సమానం. అలాగే ఆంధ్రప్రదేశ్ జీడీపీ రూ.17.62 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది దేశ జీడీపీలో 4.9 శాతానికి సమానం.
ఆర్థికంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగే సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ఇన్వెస్టర్లలో అవగాహన పెరగడం, సిప్ ఆధారిత పెట్టుబడులు, పెట్టుబడి సాధనాలకు సముచితమైన విధంగా కేటాయింపులు, క్రమశిక్షణతో దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టడంలాంటి అంశాలు కీలకమని ఏఎంఎఫ్ఐ పునరుద్ఘాటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అసెట్స్ వృద్ధి చెందుతుండటమనేది మ్యూచువల్ ఫండ్స్ మరింతగా విస్తరిస్తుండటాన్ని, అలాగే నగరాలు, విభాగాలవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసే మదుపరుల సంఖ్య పెరుగుతుండటాన్ని సూచిస్తోంది.

