ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. దానం విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ సీజే ధర్మాసనం సంచలన ఉత్తర్వులు ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారని మహేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్లు వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపుల నిబంధనలను ఆయన ఉల్లంఘించారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ విచారణ ముగియడంతో ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్‌కు, ఈసీకి హైకోర్టు సమాచారం అందించింది.
తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు దానం నాగేందర్ తెలిపారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై ఇంకా ఏదీ తేల్చుకోలేదని, దానిపై ఆలోచించాల్సి ఉందన్నారు. రాజకీయాల్లో పోరాటాలు తనకు కొత్త కాదని, యుద్ధం చేసి ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. రాబోయే ఉపఎన్నికలను పూర్తిగా స్వాగతిస్తున్నామని, ఎప్పుడు షెడ్యూల్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ కచ్చితంగా గెలుస్తానని స్పష్టం చేశారు. ఈ రాజకీయ సమరంలో చివరికి విజయం తమదేనని దానం నాగేందర్ ధీమా ప్రకటించారు.
తన జీవితం తెరిచిన పుస్తకమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేటకు వస్తున్న కాంగ్రెస్ నేతలు తన భూములు చూసిపోవచ్చని ఆయన సవాల్ చేశారు. సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసులు లేకుండా వస్తే తన ఇంటికి వస్తే కడుపునిండా భోజనం పెట్టి, తానే దగ్గరుండి తన తోట అంతా తిప్పి చూపిస్తానని హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట అంటేనే ప్రేమ, ఆప్యాయతలకు చిరునామా అని పేర్కొన్నారు. తాను ఎవరి భూములను కబ్జా చేయలేదని, ప్రజల సొమ్ము దోచుకోలేదని అన్నారు. తన ఆస్తుల వివరాలన్నీ అఫిడవిట్లో స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. తన పనితీరును చూసే ప్రజలు ఏడుసార్లు గెలిపించారని హరీశ్‌రావు గుర్తుచేశారు.
భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్ ‘క్యూడెంగా’ 2027 ప్రారంభంలో అందుబాటులోకి రానుంది. జపాన్‌కు చెందిన ‘తకేడా ఫార్మా’, హైదరాబాద్ ‘డాక్టర్ రెడ్డీస్’ మధ్య ఈ వ్యాక్సిన్ పంపిణీపై ఒప్పందం కుదిరింది. దేశంలోని ప్రైవేట్ మార్కెట్లో దీనిని విక్రయించే హక్కులను డాక్టర్ రెడ్డీస్ పొందింది. ఈ టీకాకు సిడిఎస్‌సిఒ (CDSCO) నుంచి మార్కెటింగ్ అనుమతులు కూడా లభించాయి. 4 నుండి 60 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఈ టీకా వేసుకోవడానికి అర్హులు. డెంగ్యూలోని నాలుగు రకాల వైరస్‌లపై ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది.
ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, అధికారులు బీఎల్ఎన్ రెడ్డి, కిరణ్ మల్లేశ్వరరావు కూడా కోర్టుకు వచ్చారు. ఫార్ములా ఈ-రేస్ కోసం హెచ్ఎండీఏ నుంచి నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు బదిలీ చేశారనేది ప్రధాన ఆరోపణ. గత విచారణకు కేటీఆర్ గైర్హాజరు కావడంతో విచారణ నేటికి వాయిదా పడింది. నేడు అందరూ హాజరుకావడంతో తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 30కి వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, మన్యం, పోలవరం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరొకవైపు సెప్టెంబర్ 19 సాయంత్రానికి ఉత్తర అండమాన్ వద్ద అల్పపీడనం ఏర్పడనుంది. ఇది రాబోయే 3-4 రోజుల్లో ఒడిశా – ఉత్తరాంధ్ర వైపు కదిలే సూచనలు ఉన్నాయి. దీని ప్రభావంతో వచ్చే వారమంతా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న తీవ్రమైన ఎండలు, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది.
పాకిస్థాన్‌లోని కోహట్ నగరంలో శుక్రవారం దారుణ ఘటన జరిగింది. పాత పోలీస్ లైన్స్ సమీపంలోని మసీదు వద్ద పట్టపగలే భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది అమాయకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రష్యా నుంచి చమురు కొనవద్దని ఇతర దేశాలను బెదిరిస్తున్న అమెరికా, తన స్వార్థం కోసం తీవ్ర ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం సుంకాలు విధించేలా అమెరికా కాంగ్రెస్ నూతన ఆంక్షల బిల్లును ఆమోదించింది. అయితే తన అణు విద్యుత్ అవసరాల కోసం రష్యన్ యురేనియం దిగుమతులకు మాత్రం ఆ బిల్లులో మినహాయింపులు ఇచ్చుకుంది. అమెరికా తన పౌర అణు రంగానికి కావలసిన యురేనియం శుద్ధి కోసం 26 శాతం వరకు రష్యాపైనే ఆధారపడుతోంది. దేశీయంగా ఒక్కటే శుద్ధి ప్లాంట్ ఉండటంతో అక్కడ తీవ్ర కొరత నెలకొంది.
తమిళనాడు సీఎం విజయ్ రాజకీయ ప్రయాణంపై హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ది ప్యారడైజ్’ ప్రచారంలో భాగంగా చెన్నై ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. తమిళ ప్రజలు విజయ్ను తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తూ ఎంతో నమ్మకం ఉంచారని చెప్పారు. అసెంబ్లీలో ఆయన ప్రసంగాల వీడియోలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఇదే వేదికపై తనను పాన్ ఇండియా స్టార్ అని పిలవడం ఇష్టం లేదని నాని స్పష్టం చేశారు. సౌత్ సినిమాలు హిట్ అయినప్పుడే పాన్ ఇండియా అనడం సరైనది కాదన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కానుంది.
గణేష్ ఉత్సవాల వేడుకల్లో బొద్దుగా కనిపించిన కత్రినా కైఫ్‌పై కొంతమంది నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. పాత ఫొటోలతో పోల్చుతూ ఆమెను బాడీ షేమింగ్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కత్రినా ఈ విమర్శలపై స్పందించారు. ప్రసవం తర్వాత తన చర్మం మరింత సున్నితంగా మారిందని, ఆ సమయం చాలా కష్టంగా అనిపించిందని తెలిపారు. కెరీర్ ప్రారంభంతో పోలిస్తే అందంపై తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఇప్పుడు అందంగా కనిపించడం అంటే తాను మానసికంగా సంతోషంగా ఉండటమేనని స్పష్టం చేశారు. రోజూ ధ్యానం చేయడం, ఉదయాన్నే ఫోన్‌కు దూరంగా ఉండటం తన అలవాటని పేర్కొన్నారు. లోపలి నుంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసం బయటకు కనిపిస్తుందని కత్రినా అభిప్రాయపడ్డారు.
