Last Updated:
దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో పెను విషాదం చోటుచేసుకుంది. తొలి ప్రేమ సంగీత దర్శకుడు దేవా మృతి చెందారు.
దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో పెను విషాదం చోటుచేసుకుంది. ‘తేనిసై తెండ్రల్’ (మధుర సంగీత సమీరం)గా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.
దేవా సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 400లకు పైగా చిత్రాలకు అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. ముఖ్యంగా తమిళనాడులోని స్థానిక జానపద కళారూపమైన ‘గానా’ (Gaana) పాటలను వెండితెరకు పరిచయం చేసి, ఆ మాస్ బీట్స్‌తో సామాన్య ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1989లో ‘మనసుకేత్త మహారాస’ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ వంటి అగ్ర హీరోల చిత్రాలకు ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ అందించారు. కల సంగీత సేవలకు గాను తమిళనాడు ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక ‘కలైమామణి’ పురస్కారంతో సత్కరించింది.
తెలుగు ప్రేక్షకులకు సైతం దేవా అందించిన సంగీతం ఎంతో ప్రత్యేకం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘తొలిప్రేమ’ చిత్రానికి దేవా అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఎప్పటికీ ఎవరు గ్రీన్. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మాస్టర్’, సూపర్ స్టార్ రజనీకాంత్ డబ్బింగ్ సెన్సేషన్స్ ‘బాషా’, ‘అరుణాచలం’, ‘అన్నామలై’ తో పాటు విజయ్ నటించిన తమిళ ‘ఖుషి’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. దేవా స్వరపరిచిన పాటలు నేటికీ మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్ట్‌లలో వినిపిస్తూనే ఉంటాయి.
దేవా సంగీత వారసత్వం ఆయన కుటుంబంలోనూ కొనసాగుతోంది. ఆయన కుమారుడు శ్రీకాంత్ దేవా కూడా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన సంగీత దర్శకుడిగా రాణిస్తుండగా, ఆయన సోదరులు సబేష్-మురళి ద్వయం కూడా పలు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్లుగా పనిచేశారు. దేవా హఠాన్మరణం పట్ల కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు, కోట్లాది మంది సంగీత అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆ మాస్ బీట్స్ మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

