ఒక యువతి తన కథను ఇన్‌స్టాగ్రామ్‌లోని @theindiantripper అనే సోషల్ మీడియా సైట్‌లో పంచుకుంది. ఆమె చాలా సంవత్సరాలుగా ప్రతిరోజూ చౌకగా దొరికే కాటుకను వాడుతూ ఉండేది. మొదట్లో ఎలాంటి సమస్యలూ లేవు, కానీ క్రమంగా ఆమె కళ్ళు దురద పెట్టడం, ఎర్రబడటం, ఉబ్బడం ప్రారంభించాయి. అది అలర్జీ అనుకుని ఆమె దాన్ని పట్టించుకోలేదు. కానీ ఒక రోజు, నొప్పి ఎంత తీవ్రంగా మారిందంటే ఆమె చూడలేకపోయింది. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వారు కనుక్కున్న విషయం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది.
కంటిని పరీక్షించిన తర్వాత, కాటుకలోని రసాయనాలు.. ముఖ్యంగా సీసం, పాదరసం, ఇతర భార లోహాలు.. ఇంకా బ్యాక్టీరియా.. తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యాయని డాక్టర్లు నిర్ధారించారని న్యూస్18 హిందీ రిపోర్ట్ చేసింది. ఆమె కంటిపొర దెబ్బతింది. ఆ అమ్మాయికి వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న సమయంలో, ఆమె తన వాచిన కళ్లను చూపిస్తూ, అవగాహన కల్పించేందుకు తన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రోజూ కాటుక పెట్టుకోవడం వల్ల కలిగే పరిణామాలను చూసి ఇతర మహిళలు షాక్ అవుతున్నారు. ఆ పోస్ట్ త్వరగా వైరల్ అయింది, వేల మంది మహిళలు తమ కథలను పంచుకున్నారు.
డాక్టర్లు ఏమంటున్నారు?
నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ రాకేష్ కుమార్ ప్రకారం, మార్కెట్లో లభించే చాలా చౌక కాటుకలలో సీసం, పాదరసం, పారాబెన్లు, ఇతర హానికరమైన రసాయనాలు ఉంటాయి. వీటిని దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక కండ్లకలక, కార్నియల్ అల్సర్లు, దృష్టి లోపం, శాశ్వత నష్టం వంటి అనేక రకాల సమస్యలు కలుగవచ్చు.
ఎప్పుడూ ISI మార్క్ లేదా FSSAI ఆమోదం ఉన్న కాటుకనే కొనండి.
సీసం, పాదరసం లేనిదిగా లేబుల్ చేసిన ఆయుర్వేద లేదా హెర్బల్ కాటుకను ఎంచుకోండి.
దీనిని ప్రతిరోజూ కాకుండా, వారానికి 3-4 సార్లు మాత్రమే సున్నితంగా అప్లై చేయండి.
నిద్రపోయే ముందు తప్పకుండా దీనిని తొలగించండి.
గడువు తేదీని తనిఖీ చేయండి.
దురద, ఎరుపు లేదా నొప్పి వంటివి సంభవిస్తే, వెంటనే వాడకాన్ని నిలిపివేసి, డాక్టర్‌ని సంప్రదించండి.
