Last Updated:
ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన అనుభవం పొందాలని చూస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు, పరిశోధకులకు మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. మరి ఈ అవకాశానికి ఎవరు అర్హులు? ఎన్ని స్థానాలు ఉన్నాయి? దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు? పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇంజినీరింగ్ విద్యార్థులు, పరిశోధకులకు మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. దేశ విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించే గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GRID-INDIA) ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 స్టైపెండ్ లభిస్తుంది. విద్యుత్ రంగంలో తమ నైపుణ్యాలను పెంచుకోవడంతో పాటు, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన అనుభవాన్ని పొందాలనుకునే వారికి ఇది ఉపయోగకరమైన అవకాశం. అర్హత ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రిడ్ ఇండియా ఇంటర్న్‌షిప్ కార్యక్రమం ఆరు నెలల పాటు కొనసాగుతుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ, ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రాల్లో విద్యుత్ నిర్వహణకు సంబంధించిన ప్రత్యక్ష అనుభవాన్ని పొందవచ్చు. విద్యుత్ సరఫరా వ్యవస్థను పర్యవేక్షించడం, నిజ సమయంలో విద్యుత్ నిర్వహణ ఎలా జరుగుతుందో తెలుసుకోవడం, ప్రాజెక్టులపై పనిచేయడం వంటి అంశాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 15 స్థానాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు 2026 నవంబర్ 6వ తేదీలోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. పూర్తి వివరాల కోసం grid-india.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
ఈ ఇంటర్న్‌షిప్‌కు విద్యుత్, విద్యుత్ వ్యవస్థలకు సంబంధించిన విభాగాల్లో చదువుతున్నవారు లేదా సంబంధిత ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారు అర్హులు. ఎలక్ట్రికల్, పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్ చదువుతున్న విద్యార్థులు, ఆ కోర్సులు పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు కనీసం 65 శాతం మార్కులు లేదా దానికి సమానమైన సీజీపీఏ సాధించి ఉండాలి.
పవర్ సిస్టమ్స్ లేదా సంబంధిత విభాగాల్లో ఎంటెక్, ఎంఈ, ఎంఎస్‌ఆర్ వంటి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారు, పూర్తి చేసినవారు కూడా అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా పవర్ సిస్టమ్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న పరిశోధకులు సైతం ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ ఇంటర్న్‌షిప్ కోసం ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థుల విద్యార్హతలు, సీజీపీఏ, విద్యాసంస్థ నిర్దేశించిన ప్రమాణాలను పరిశీలించి తొలుత అర్హులను ఎంపిక చేస్తారు. అనంతరం ప్రాజెక్టుల అవసరాలు, ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు. ఎంపికైనవారికి దేశంలోని ఆరు జాతీయ, ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రాల్లో (NLDC/RLDC) ప్రాక్టికల్ శిక్షణ అందిస్తారు.
ముందుగా grid-india.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘Careers’ విభాగంలోని ‘Current Openings’ను ఎంచుకోవాలి. అక్కడ ‘GRID-INDIA Internship 2026’ ప్రకటనను తెరిచి నిబంధనలు చదవాలి. అనంతరం దరఖాస్తు పత్రంలో వ్యక్తిగత, విద్యార్హతల వివరాలను నమోదు చేసి, మార్కుల జాబితాలు, డిగ్రీ లేదా గుర్తింపు పత్రాలు, ఫొటో, సంతకం వంటి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. వివరాలను మరోసారి పరిశీలించి సమర్పించాలి. చివరగా నిర్ధారణ పేజీని భద్రపరచుకోవాలి.

