న్యూస్18 ఇంగ్లీష్ వెల్లడించిన కథనం ప్రకారం.. ఇప్పటివరకు 2.2 కోట్లకు పైగా ITRలు దాఖలయ్యాయి. వీటిలో సుమారు 1.33 కోట్ల రిటర్న్‌లను ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే ప్రాసెస్ చేసింది. పన్ను నిపుణుల ప్రకారం, అన్ని వివరాలు సరిగ్గా ఉంటే చాలామంది పన్ను చెల్లింపుదారులు ITR దాఖలు చేసిన 7 నుంచి 10 పని దినాల్లోనే తమ బ్యాంక్ ఖాతాలో రీఫండ్‌ను పొందుతున్నారు.
ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువ మొత్తం ప్రభుత్వానికి చెల్లిస్తే, ఆ అదనపు మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖ తిరిగి మీకు చెల్లిస్తుంది. దీనినే ITR రీఫండ్ అంటారు. ఉద్యోగుల జీతాల నుంచి TDS రూపంలో పన్ను కట్ కావడం, అడ్వాన్స్ టాక్స్ చెల్లించడం లేదా సెల్ఫ్ అసెస్‌మెంట్ టాక్స్ ద్వారా ఎక్కువ మొత్తం చెల్లించడం వంటి కారణాల వల్ల కొన్నిసార్లు పన్ను బాధ్యత కంటే ఎక్కువ పన్ను చెల్లించే పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సందర్భాల్లో ITR దాఖలు చేసిన తర్వాత అదనంగా చెల్లించిన మొత్తాన్ని రీఫండ్ రూపంలో తిరిగి పొందవచ్చు.
ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, సాధారణంగా ITR ఈ-వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత 4 నుంచి 5 వారాల్లో రీఫండ్ జమ అవుతుంది. అయితే ప్రస్తుతం ప్రాసెసింగ్ వేగం పెరగడంతో, రిటర్న్‌లో ఎలాంటి పొరపాట్లు లేకపోతే, AIS (Annual Information Statement), TDS వివరాలు సరిపోతే, బ్యాంక్ ఖాతా సరిగ్గా నమోదు చేసి ప్రీ-వాలిడేట్ చేసి ఉంటే, ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసిన 7 నుంచి 10 పని దినాల్లోనే రీఫండ్ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందని పన్ను నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని క్లిష్టమైన కేసుల్లో లేదా అదనపు పరిశీలన అవసరమైతే రీఫండ్ రావడానికి ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉంటుంది.
గత అసెస్‌మెంట్ ఇయర్‌లో చాలా మంది పన్ను చెల్లింపుదారులు రీఫండ్ కోసం ఎక్కువ రోజులు వేచి చూడాల్సి వచ్చింది. చాలా మందికి రీఫండ్‌లు సమయానికి వచ్చినప్పటికీ, కొంతమంది దాఖలు చేసిన క్లెయిమ్‌లను ఆదాయపు పన్ను శాఖ వ్యవస్థ ‘రెడ్ ఫ్లాగ్స్’గా గుర్తించింది. అంటే రిటర్న్‌లో కొన్ని వివరాలు అనుమానాస్పదంగా కనిపించడం లేదా అదనపు ధృవీకరణ అవసరమవడం వల్ల ఆ రీఫండ్‌లు పెండింగ్‌లో నిలిచిపోయాయి. అసెస్‌మెంట్ ఇయర్ 2025-26లో మొత్తం 6.97 కోట్ల ITRలు దాఖలయ్యాయి.
మీ రీఫండ్ ప్రాసెస్ ఎక్కడ వరకు వచ్చిందో ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు.
స్టెప్ 1: ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించండి.
స్టెప్ 2: మీ యూజర్ ఐడీ (సాధారణంగా PAN) మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
స్టెప్ 3: e-File విభాగంలోకి వెళ్లి Income Tax Returns ఎంపిక చేసి, View Filed Returns పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: మీరు దాఖలు చేసిన సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌ను ఎంచుకుని రీఫండ్ స్థితిని చూడవచ్చు.
అక్కడ మీ రీఫండ్ Under Processing, Partial Refund Adjusted, Full Refund Adjusted లేదా Refund Failure వంటి స్టేటస్‌లలో ఏ దశలో ఉందో తెలుస్తుంది.
కొన్నిసార్లు ఆదాయపు పన్ను శాఖ రీఫండ్ విడుదల చేసినప్పటికీ అది మీ బ్యాంక్ ఖాతాలో జమ కాకపోవచ్చు. దీనికి కొన్ని సాధారణ కారణాలు ఉంటాయి.
మీ PAN కార్డు ఆధార్‌తో లింక్ కాకపోవడం వల్ల అది Inoperative PANగా మారి ఉండవచ్చు. అలాంటి సందర్భంలో రీఫండ్ ప్రాసెస్ పూర్తికాదు.
మీ బ్యాంక్ ఖాతా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో Pre-Validate చేయకపోయినా రీఫండ్ నిలిచిపోతుంది. ప్రస్తుతం బ్యాంక్ ఖాతాను ముందుగానే ధృవీకరించడం తప్పనిసరి.
బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరు, PAN కార్డులోని పేరుతో సరిపోలకపోవడం కూడా మరో కారణం. అలాగే తప్పుగా IFSC కోడ్ నమోదు చేసినా లేదా చెల్లని IFSC కోడ్ ఇచ్చినా రీఫండ్ విఫలమవుతుంది.
ఇక ITRలో పేర్కొన్న బ్యాంక్ ఖాతా క్లోజింగ్‌లో ఉంటే కూడా రీఫండ్ జమ కాదు. అందువల్ల ITR దాఖలు చేసే ముందు బ్యాంక్ ఖాతా వివరాలు, PAN-ఆధార్ లింక్, IFSC కోడ్, ఖాతా ప్రీ-వాలిడేషన్ వంటి వివరాలను ఒకసారి తప్పకుండా తనిఖీ చేసుకోవడం మంచిది.
