Last Updated:
Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ రద్దు నిబంధనలు, బోర్డింగ్ స్టేషన్ మార్పు, కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్‌తో పాటు మొత్తం ఐదు కీలక సంస్కరణలను ప్రకటించింది. ఈ మార్పులతో రైల్వే సేవలు మరింత సులభతరం కానుండగా, ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
భారతీయ రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ’52 వారాల్లో 52 సంస్కరణలు’ కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే మంగళవారం ఐదు కొత్త సంస్కరణలను ప్రకటించింది. ఈ మార్పులు రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, టికెట్ రద్దు నిబంధనలు, ప్రయాణికుల బోర్డింగ్ సౌకర్యం, అలాగే సరుకు రవాణా వ్యవస్థకు సంబంధించినవి. ఈ సంస్కరణల ద్వారా రైల్వే సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, ప్రయాణికులకు అనుకూలంగా తీర్చిదిద్దాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. రైల్వే ప్రాజెక్టుల నాణ్యతను మెరుగుపరచడం, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడం, సరుకు రవాణాను ఆధునికీకరించడం వంటి లక్ష్యాలతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న భారీ రైల్వే అభివృద్ధి పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయడంలో ఈ మార్పులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.
CNBCTV18 వెల్లడించిన కథనం ప్రకారం.. ఈ సంస్కరణల్లో అత్యంత కీలకమైన మార్పు రైల్వే మౌలిక సదుపాయాల పనులకు బిడ్లు వేసే కాంట్రాక్టర్లకు సంబంధించింది. ఇకపై అనుభవం లేని సంస్థలకు భారీ రైల్వే ప్రాజెక్టులు దక్కకుండా కఠినమైన అర్హత నిబంధనలు అమలు చేయనున్నారు. గతంలో ఇలాంటి ప్రాజెక్టుల్లో పని చేసిన అనుభవం ఉన్న సంస్థలకే ప్రాధాన్యం ఇవ్వాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రత్యేకంగా ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (EPC) కాంట్రాక్టుల కోసం దరఖాస్తు చేసే కంపెనీలు, గతంలో కనీసం 20 శాతం ఇలాంటి పనులను విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి. దీంతో నాణ్యత లేని పనులు తగ్గి, అనుభవం ఉన్న సంస్థలకే కీలక ప్రాజెక్టులు దక్కే అవకాశం ఉంటుంది.
కాంట్రాక్టర్ల ఎంపిక ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు బిడ్ సెక్యూరిటీ మొత్తాన్ని ప్రాజెక్ట్ విలువలో 2 శాతంగా నిర్ణయించారు. అలాగే రూ.10 కోట్లకు పైబడిన ప్రాజెక్టుల విషయంలో కాంట్రాక్టర్ల బిడ్డింగ్ సామర్థ్యాన్ని ముందుగానే పరిశీలిస్తారు. దీంతో ఆర్థికంగా, సాంకేతికంగా సామర్థ్యం ఉన్న సంస్థలే పెద్ద ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ చర్యలతో ప్రాజెక్టులు మధ్యలో నిలిచిపోవడం లేదా ఆలస్యం కావడం వంటి సమస్యలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా రైల్వే శాఖ టికెట్ రద్దు, రీఫండ్ నిబంధనల్లో కూడా మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ప్రయాణానికి 72 గంటల కంటే ముందే టికెట్ రద్దు చేస్తే ప్రతి ప్రయాణికుడికి ఒకే విధమైన కనీస రద్దు ఛార్జీ మాత్రమే వర్తిస్తుంది. దీంతో ముందుగానే ప్రయాణాన్ని రద్దు చేసుకునే వారికి ప్రయోజనం కలగనుంది. అలాగే రైలు బయలుదేరడానికి 72 గంటల నుంచి 24 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే టికెట్ మొత్తంలో 25 శాతం రద్దు ఛార్జీగా మినహాయిస్తారు. అంటే మిగిలిన మొత్తం ప్రయాణికుడికి రీఫండ్‌గా లభిస్తుంది. ఇక రైలు బయలుదేరడానికి 24 గంటల నుంచి 8 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే టికెట్ ఛార్జీలో 50 శాతం మాత్రమే తిరిగి చెల్లిస్తారు. అయితే రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ ఇవ్వరు. ఈ మార్పులతో టికెట్ రద్దు ప్రక్రియ మరింత స్పష్టంగా ఉండనుంది. ఇప్పటివరకు కౌంటర్‌లో కొనుగోలు చేసిన టికెట్‌ను సాధారణంగా అదే బుకింగ్ స్టేషన్‌లో మాత్రమే రద్దు చేసుకునే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై దేశంలోని ఏ రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లోనైనా కౌంటర్ టికెట్‌ను రద్దు చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీంతో ఇతర నగరాల్లో ఉన్న ప్రయాణికులు కూడా సులభంగా టికెట్ రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రయాణికులకు మరో ముఖ్యమైన సౌకర్యాన్ని కూడా రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు రిజర్వేషన్ చార్ట్ సిద్ధమయ్యేలోపు మాత్రమే బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే అవకాశం ఉండేది. ఇకపై రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు కూడా బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే అవకాశం కల్పించారు. ప్రయాణ ప్రణాళికలో చివరి నిమిషంలో మార్పులు వచ్చినా ఇది ప్రయాణికులకు ఉపయోగపడనుంది.
ప్రయాణికుల సేవలతో పాటు సరుకు రవాణా వ్యవస్థను కూడా రైల్వే శాఖ మరింత ఆధునికీకరించనుంది. ఆటోమొబైల్ రంగం అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగిల్-స్టాక్, డబుల్-స్టాక్ వ్యాగన్‌లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో వాహనాల రవాణా మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో జరిగే అవకాశం ఉంది. ఉప్పు రవాణా కోసం కూడా కొత్త సాంకేతికతను తీసుకురానున్నారు. దీనిలో భాగంగా స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్లను వినియోగంలోకి తీసుకురానున్నారు. ఈ కంటైనర్లలో పై భాగం నుంచి ఉప్పును లోడ్ చేసి, పక్క భాగం నుంచి అన్‌లోడ్ చేసే విధంగా ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కొత్త విధానం వల్ల తుప్పు పట్టడం, నీటి లీకేజీ, రవాణా సమయంలో సరుకు నష్టం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఉప్పును నేరుగా ఉత్పత్తి కేంద్రాల వద్దనే లోడ్ చేసి, వివిధ రవాణా మార్గాల ద్వారా గమ్యస్థానాలకు మరింత సమర్థవంతంగా తరలించే అవకాశం కలుగుతుందని రైల్వే శాఖ తెలిపింది.
Hyderabad,Telangana

