Last Updated:
ఒకప్పుడు విదేశాల్లో లగ్జరీ లైఫ్‌స్టైల్ అనుభవించిన ఐబొమ్మ రవిని ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం కనీస అవసరాలు తీర్చుకోవడంతో పాటు కుటుంబాన్ని పోషించుకోవడం కూడా కష్టంగా మారిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఒకప్పుడు విదేశాల్లో లగ్జరీ లైఫ్‌స్టైల్ అనుభవించిన ఐబొమ్మ రవిని ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం కనీస అవసరాలు తీర్చుకోవడంతో పాటు కుటుంబాన్ని పోషించుకోవడం కూడా కష్టంగా మారిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తనకు చెందిన ఫ్రీజ్ చేసిన బ్యాంక్ ఖాతాల్లో కొన్నింటినైనా అన్‌ఫ్రీజ్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తన బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ కావడంతో రోజువారీ ఖర్చులు, కుటుంబ పోషణ, నిత్యావసరాలు, వైద్య ఖర్చులను భరించడం తీవ్ర ఇబ్బందిగా మారిందని రవి తన పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం.
ఐబొమ్మ పైరసీ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు రవిని అరెస్ట్ చేసిన అనంతరం ఆయనకు సంబంధించిన పలు బ్యాంక్ ఖాతాలు, ప్రాపర్టీ డిపాజిట్లను ఫ్రీజ్ చేశారు. పైరసీ ద్వారా వచ్చినట్లు అనుమానిస్తున్న ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే అన్ని ఖాతాలు ఫ్రీజ్ కావడంతో తన వ్యక్తిగత అవసరాలు మాత్రమే కాకుండా కుటుంబ జీవనం కొనసాగించడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రవి కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో కనీస అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగపడేలా తన ఫ్రీజ్ చేసిన బ్యాంక్ ఖాతాల్లో కొన్నింటిని అన్‌ఫ్రీజ్ చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. కుటుంబాన్ని పోషించుకోవడం, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడం, వైద్య ఖర్చులు చెల్లించడం వంటి అవసరాల కోసం డబ్బు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నానని పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. రవి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై పోలీసులు తమ వివరణను కోర్టుకు సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అనంతరం ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేయాలా లేదా అన్న అంశంపై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఐబొమ్మ వెబ్సైట్ వ్యవహారం కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సినిమాలను అనధికారికంగా ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఐబొమ్మ భారీగా ఆదాయం ఆర్జించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధానంగా పైరసీ కంటెంట్‌ను ప్రసారం చేయడం, దాని ద్వారా వచ్చినట్లు అనుమానిస్తున్న ఆదాయం, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు సాగుతున్నట్లు సమాచారం.
రవి గతంలో పోలీసులకు సవాల్ విసిరినట్లు కూడా వార్తలు వచ్చాయి. తనను పట్టుకోవాలంటూ పోలీసులకు సవాల్ చేయడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది. ఆ తర్వాత రవి హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో పోలీసులు నిఘా పెట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు దర్యాప్తులో భాగంగా ఆయనను అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచారు. కొంతకాలం జైలు శిక్ష అనుభవించిన తర్వాత రవి బేయిల్‌పై బయటకు వచ్చాడు.
నిజానికి.. రవి ఒకవైపు సినిమా ఇండస్ట్రీకి పెద్ద విలన్, మరో వైపు సామాన్య ప్రేక్షకులకు దేవుడు. అంతెందుకు ఆయన అరెస్ట్‌ను అప్పుడు చాలా మంది ఖండించారు కూడా. మీరు కోట్లల్లో రెమ్యూనరేషన్లు తీసుకుంటూ.. కోట్ల బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసి మా మీద టిక్కెట్ల భారం వేస్తున్నారు. మీరు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించి, టిక్కెట్ రేట్లు తగ్గిస్తే.. ఎవ్వరూ పైరసీని ఎంకరేజ్ చేయరు అంటూ వేలల్లో కామెంట్స్ పెడుతున్నారు. అయితే.. ఇక్కడ రవి కేవలం సినిమాలు మాత్రమే ఫ్రీగా చూపిస్తున్నాడు అనుకుంటే పొరపాటే. దాదాపు 50 లక్షల మంది డేటా ఆయన దొంగతనంగా తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలిసి షాక్ అవ్వని వారు కూడా లేకపోలేరు.
ఏది ఏమైనా మన వరకు ఫ్రీగా సినిమాలు చూడడం హ్యాపీగానే అనిపించొచ్చు కానీ.. దాని వెనుకున్న అసలు నిజం.. మన డేటా వేరొకరికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. చాలా మందికి రవి చేస్తున్నది కరెక్టే అనిపించొచ్చు. వందలు పెట్టి టిక్కెట్లు కొనుక్కోవడం.. ఓటీటీల సబ్ స్క్రిప్షన్లు భారం అనిపించిన వారికి రవి ఒక సినిమా దేవుడు అయ్యుండొచ్చు.. కానీ ఆయన చేసింది ముమ్ముటాకి తప్పే.
ప్రస్తుతం తన బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ రవి కోర్టును ఆశ్రయించడం మరోసారి ఐబొమ్మ కేసును వార్తల్లోకి తీసుకొచ్చింది. అయితే బ్యాంక్ ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేసే విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోలీసులు తమ వాదనను కోర్టు ముందు ఉంచిన తర్వాత ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

