ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి హుండీకి రూ.1.31 కోట్ల ఆదాయం!
14 రోజుల హుండీ లెక్కింపులో రూ.1,20,72,793.. అన్నదాన హుండీ ద్వారా రూ.10,76,772,
ప్రభ న్యూస్ , కౌతాళం , కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 15 :
ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో 2026 శ్రావణమాసం ఉత్సవాలకు సంబంధించి మంగళవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో స్వామివారికి భారీగా ఆదాయం సమకూరింది. మొత్తం 14 రోజుల హుండీ కానుకలను లెక్కించగా రూ.1,20,72,793 ఆదాయం లభించింది. అన్నదాన హుండీ ద్వారా మరో రూ.10,76,772 ఆదాయం సమకూరింది. దీంతో స్వామివారి హుండీల ద్వారా మొత్తం రూ.1,31,49,565 ఆదాయం వచ్చినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.
హుండీ లెక్కింపులో 31 గ్రాముల 770 మిల్లీగ్రాముల బంగారం, 14 కిలోల 500 గ్రాముల వెండి లభించాయి. అలాగే శ్రీలంకకు చెందిన 50 రూపాయల నోటు కూడా హుండీలో లభించింది.
2026 శ్రావణమాసం ఉత్సవాలకు సంబంధించి జరిగిన ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం దేవస్థానం డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి కె. వాణి ఆధ్వర్యంలో, పాలకమండలి సభ్యుల పర్యవేక్షణలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారి బి. సుధాకర్ రెడ్డి, కర్నూలు అసిస్టెంట్ కమిషనర్, వాణి, వెంకటేశ్వర్లు, రాజకుమార్, రాము, కిరణ్, శివ, విట్టల్,దేవస్థాన పర్యవేక్షకులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉరుకుంద శాఖ సిబ్బంది, శ్రీ భ్రమరాంభ సేవా సమితి ఆదోని సభ్యులు పాల్గొన్నారు.

