ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, ఇతర కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో చిత్ర బృందం సినిమా విశేషాలను పంచుకుంది.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ.. దర్శకుడు పరమేష్లో సినిమా పట్ల ఎంతో తపన ఉందని ప్రశంసించారు. ఈ సినిమా కోసం ఆయనతో కలిసి చాలా కాలం ప్రయాణించానని, దర్శకుడిగా పరమేష్ ప్రతిభ ఈ చిత్రంతో అందరికీ తెలుస్తుందని అన్నారు. సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేశారని, తప్పకుండా ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం ఉందని తెలిపారు.
ఎడిటర్ ఆవుల వెంకటేష్ మాట్లాడుతూ.. పరమేష్ ఎంతో క్రియేటివ్ పర్సన్ అని, ఆయనను దర్శకుడిగా పరిచయం చేయడం కోసం స్నేహితులంతా కలిసి సహకరించారని చెప్పారు. ఇదొక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని, యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని అభిప్రాయపడ్డారు.
నిర్మాత మాదం దయానంద్ మాట్లాడుతూ.. విజయ్ సి. కుమార్ తమ సినిమాకు పనిచేస్తున్నారని తెలియగానే చిత్రంపై మరింత నమ్మకం పెరిగిందన్నారు. ప్రేమ, పెళ్లి, కెరీర్‌తో పాటు స్వతంత్రంగా జీవించాలనుకునే నేటి జెన్ జీ యువత ఆలోచనలు, భావోద్వేగాలను సహజంగా చూపించే ప్రయత్నం చేశామని వివరించారు. ఎలాంటి సినిమాటిక్ అతిశయోక్తులు లేకుండా నిజ జీవితంలో యువత ఎదుర్కొనే పరిస్థితులను తెరకెక్కించామని చెప్పారు.
హీరోయిన్ జుప్సీ భద్ర మాట్లాడుతూ.. కథ వినగానే ఎంతో పవర్‌ఫుల్‌గా అనిపించిందని, దర్శకుడు ఎంతో స్పష్టతతో సినిమాను తెరకెక్కించారని అన్నారు. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా ఈ చిత్రం నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “సమాజంలో మన కళ్లముందు జరిగే కొన్ని సంఘటనల గురించి బయటకు మాట్లాడటానికి చాలామంది ఇష్టపడరు. అలాంటి సంఘటనల సమాహారమే ఈ సినిమా. ట్రైలర్ చూసిన చాలామంది ఇంత బోల్డ్ కంటెంట్‌తో ఎందుకు వస్తున్నావని అడిగారు. కానీ ఇది అందరూ అనుకుంటున్నట్లుగా బోల్డ్ సినిమా కాదు. చూడటానికి కొంత ఇబ్బందిగా అనిపించే మెచ్యూర్డ్ కంటెంట్‌తో తెరకెక్కించిన హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ.
నేటి యువత అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి తిరుగుతున్నారు. ప్రేమించుకుంటున్నారు. కానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి మాత్రం తల్లిదండ్రులు చూసిన సంబంధాలనే చేసుకుంటున్నారు. అసలు ప్రేమించిన వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు? ఆ విషయంలో తల్లిదండ్రులతో ఎందుకు పోరాడలేకపోతున్నారు? అనే అంశాలను ఇందులో చూపించాం. ఇది మన చుట్టూ జరుగుతున్న కథ. సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికీ తమకు తెలిసిన వారి జీవితంలో జరిగిన సంఘటనలే గుర్తుకొస్తాయి. జెన్ జీ యువతకు ఈ కథ తప్పకుండా కనెక్ట్ అవుతుంది. దర్శకుడిగా ఈ సినిమా విజయంపై నాకు పూర్తి నమ్మకం ఉంది” అని తెలిపారు.
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. సమాజంలో బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడని కొన్ని డార్క్ సీక్రెట్స్, ధైర్యంగా చర్చించాల్సిన అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని అన్నారు. ముగ్గురు అమ్మాయిల ప్రయాణం, ఒక అబ్బాయి జీవితంతో ముడిపడిన కథను దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించారని చెప్పారు. సినిమా ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని, విడుదలైన తర్వాత ప్రేక్షకులు ఈ సినిమా గురించి చర్చించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మొత్తానికి బోల్డ్ కంటెంట్ అనే ప్రచారానికి భిన్నంగా ప్రేమ, పెళ్లి, కుటుంబం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలతో రూపొందిన ‘ఐ హేట్ మ్యారేజ్’ ఈ నెల 27న థియేటర్లలోకి రానుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
