డాక్టర్ గౌతమ్ ప్రకారం.. కోపం అనేది ఒక భావోద్వేగ స్పందన. మనిషి ఏదైనా ప్రమాదం లేదా ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు శరీరం ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ అనే స్థితిలోకి వెళ్తుంది. అంటే పరిస్థితిని ఎదుర్కోవడానికి లేదా అక్కడి నుంచి తప్పించుకోవడానికి శరీరం సిద్ధమవుతుంది. కోపం వచ్చినప్పుడు కూడా ఇలాంటి ప్రక్రియే జరుగుతుంది.
ఈ సమయంలో శరీరంలో అడ్రినలిన్, నోరాడ్రినలిన్ వంటి హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఫలితంగా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. రక్తపోటును నియంత్రించేందుకు రక్తనాళాలు కుచించుకుపోవచ్చు. అదే సమయంలో కండరాలకు ఎక్కువ రక్తం సరఫరా అవుతుంది. దీంతో శరీరం ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్లుగా మారుతుంది.
కోపం కొద్దిసేపే ఉండి ఆ తర్వాత మనిషి ప్రశాంతంగా మారినా.. దాని ప్రభావం వెంటనే పూర్తిగా తగ్గిపోదని వైద్యులు చెబుతున్నారు. కోపం సమయంలో రక్తనాళాల్లో ఏర్పడే సంకోచం సుమారు 40 నుంచి 70 నిమిషాల వరకు కొనసాగవచ్చని డాక్టర్ గౌతమ్ తెలిపారు.
ప్రతిసారీ కోపం వచ్చినంత మాత్రాన హార్ట్ ఎటాక్ వస్తుందని చెప్పలేం. అయితే తీవ్రమైన కోపం కొన్ని పరిస్థితుల్లో హార్ట్ ఎటాక్ ముప్పును పెంచవచ్చు. INTERHEART అధ్యయనంలో హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన పలు ప్రమాద కారకాలను పరిశీలించారు. అందులో భాగంగా కొంతమంది వ్యక్తులకు హార్ట్ ఎటాక్ రావడానికి ముందు గంటలో తీవ్రమైన కోపం వచ్చినట్లు లేదా తమ సామర్థ్యానికి మించి శారీరక శ్రమ చేసినట్లు గుర్తించారు.
తీవ్రమైన కోపం వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో హార్ట్ ఎటాక్ ముప్పు సుమారు రెండున్నర రెట్లు పెరగవచ్చని డాక్టర్ గౌతమ్ వివరించారు. అయితే దీనిని ప్రతి వ్యక్తికీ వర్తింపజేయలేం. ముఖ్యంగా ఇప్పటికే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారిలో కోపం వల్ల ప్రమాదం మరింత ఎక్కువగా ఉండొచ్చు.
ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, గతంలో హార్ట్ ఎటాక్ వచ్చినవారు, బీపీ లేదా డయాబెటిస్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. తరచూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు, కాళ్లలోని రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కుటుంబంలో ఎవరికైనా గతంలో హార్ట్ ఎటాక్ వచ్చిన చరిత్ర ఉంటే గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
అయితే ప్రతి ఒక్కరి శరీరం కోపానికి ఒకే విధంగా స్పందించదు. కొంతమందిలో ఎలాంటి తీవ్రమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. మరికొందరిలో ముఖం ఎర్రబడటం, చేతులు, కాళ్లు వణకడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు.
కోపం తగ్గిన తర్వాత కూడా ఛాతీలో బరువుగా అనిపించడం, విపరీతంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అసౌకర్యం వంటి లక్షణాలు కొనసాగితే నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఈ లక్షణాలు సుమారు 5 నిమిషాల తర్వాత కూడా తగ్గకపోతే లేదా క్రమంగా తీవ్రమవుతుంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
ఎందుకంటే ఇవి సాధారణంగా కోపం వల్ల వచ్చే శారీరక ప్రతిస్పందన కావొచ్చు.. అదే సమయంలో హార్ట్ ఎటాక్‌కు హెచ్చరిక సంకేతాలు కూడా కావచ్చు. అందుకే తీవ్ర కోపం వచ్చిన సమయంలో శరీరంలో కనిపించే మార్పులను తేలికగా తీసుకోకుండా, అవసరమైతే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం మంచిది.
