గత కొంతకాలంగా బంగారం ధరలు సామాన్యులకు అందని స్థాయికి చేరుకున్నాయి. దీంతో వివాహాలు, శుభకార్యాలు లేదా పెట్టుబడుల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు చేయించుకోవాలనుకునే కుటుంబాలు అధిక ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేస్తున్నాయి. అయితే ఇలాంటి వారికి కొంత ఊరటనిచ్చే అంచనాలను అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. రాబోయే నెలల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, కొన్ని విశ్లేషణల ప్రకారం గరిష్ట స్థాయిలతో పోలిస్తే 50 శాతం వరకు కూడా క్షీణించే అవకాశం ఉన్నట్లు న్యూస్18 గుజరాతీ వెల్లడించింది. అయితే ఈ అంచనాలు మార్కెట్ పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటాయని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల ధరలు ఖచ్చితంగా అంత మేరకు తగ్గుతాయని చెప్పలేమని, కానీ ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తున్న సంకేతాలు మాత్రం బంగారం ధరలపై ఒత్తిడి పెరుగుతున్నట్లు సూచిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

