Last Updated:
మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో వచ్చిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. వివరాల్లోకి పోతే..
మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తనదైన విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులు. ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన స్ట్రెయిట్ తెలుగు చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) సమర్పణలో రూపొందిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. డార్క్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా అక్టోబర్ 30వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది.
శశాంక్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సూరి (ఫహద్ ఫాజిల్) ఓ అనాథ. హైదరాబాద్ నగరంలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తూ, తన స్నేహితుడితో (వెంకటేష్ కాకుమాను) కలిసి ఒకే గదిలో నివసిస్తుంటాడు. సూరికి డబ్బు మీద విపరీతమైన ఆశ. ఎప్పుడూ సులభంగా డబ్బు ఎలా సంపాదించాలనే ఆలోచనలతోనే ఉంటాడు. ఈ క్రమంలో ఓ పందెంలో మోసం చేసి, పాతబస్తీకి చెందిన కరుడుగట్టిన డాన్ అస్లాం భాయ్ (మహేష్ మంజ్రేకర్) గ్యాంగ్ కంట్లో పడతాడు. వారు సూరిని పట్టుకుని 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ప్రాణభయంతో ఉన్న సూరి, ఆ డబ్బు కోసం ఓ సంపన్న కుటుంబానికి చెందిన చిన్నారి దివ్య (సారా పాలేకర్)ని కిడ్నాప్ చేసి ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేయాలని నిర్ణయించుకుంటాడు.
వచ్చిన కోటి రూపాయలలో 25 లక్షలు అస్లాం భాయ్‌కి ఇచ్చేసి, మిగిలిన 75 లక్షలతో దుబాయ్ పారిపోయి సెటిల్ అవ్వాలనేది సూరి మాస్టర్ ప్లాన్. తన తల్లిదండ్రులను తానే మాయం చేశానని, తనను ఎలాగైనా వారి వద్దకు తీసుకువెళ్లాలని అమాయకంగా సూరి దగ్గరకు వచ్చిన దివ్యని, ఆమె పెంపుడు కుక్క స్నూపీని పథకం ప్రకారం తీసుకెళ్లి తన కిడ్నాప్ నాటకానికి వాడుకుంటాడు. ఇంతకీ సూరి వేసిన ఈ కిడ్నాప్ ప్లాన్ సక్సెస్ అయిందా? అస్లాం భాయ్ గ్యాంగ్ నుంచి అతను ఎలా తప్పించుకున్నాడు? ఈ కిడ్నాప్ డ్రామాలో ఎదురైన సవాళ్లు ఏంటి? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా సాగుతుంది.
రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడి బ్రాండ్, ఫహద్ ఫాజిల్ లాంటి అద్భుతమైన నటుడి కాంబినేషన్ ఉండటంతో థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ తరహా క్రైమ్ డ్రామాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అక్టోబర్ 30న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి.

