Last Updated:
ఒక సాధారణ కుటుంబం నుంచి మొదలైన ప్రయాణం.. ప్రపంచం దృష్టిని ఆకర్షించే స్థాయికి ఎదిగిన వ్యాపార సామ్రాజ్యం.. ఆ తర్వాత కోట్లాది మందిని ఇంటర్నెట్‌తో అనుసంధానించిన జియో! ఐపీఓ లిస్టింగ్ వేళ అనంత్ అంబానీ తన తాత ధీరూభాయ్ అంబానీ కలను, తండ్రి ఆశయాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు.
Anant Ambani Speech: రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ సాధారణ స్థాయి నుంచి ప్రారంభించి గొప్ప కలను నిజం చేసుకున్న విధానాన్ని ఆయన మనవడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జియో ప్లాట్‌ఫామ్స్ డైరెక్టర్ అనంత్ అంబానీ గుర్తుచేసుకున్నారు. బుధవారం జరిగిన ఐపీఓ లిస్టింగ్ వేడుకలో ఆయన జియో ప్రస్థానం, కుటుంబ సభ్యుల సహకారం, కోట్లాది మంది వినియోగదారులతో ఏర్పడిన అనుబంధం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. జియోపై నమ్మకం ఉంచి ఈ స్థాయికి తీసుకొచ్చిన లక్షలాది మందికి కృతజ్ఞతలు తెలిపారు. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మోగే గంట తనకు ఆలయ గంటలా అనిపిస్తుందని, వ్యాపారం తన దృష్టిలో పూజతో సమానమని పేర్కొన్నారు. ఈ రోజు జియోను భారతదేశంతో పంచుకుంటున్నామని చెప్పారు.
గుజరాత్‌లోని చోర్వాడ్‌లో సాధారణ కుటుంబంలో పుట్టిన ధీరూభాయ్ అంబానీ ఒకప్పుడు ఏడెన్‌లో పెట్రోల్ పంపులో పనిచేశారని అనంత్ గుర్తుచేశారు. అప్పట్లో పెద్దగా డబ్బు, గుర్తింపు లేకపోయినా అసాధారణమైన లక్ష్యాన్ని సాధించవచ్చని ఆయన నిరూపించారని చెప్పారు. ప్రతి భారతీయుడు గొప్ప కలలు కనవచ్చనే నమ్మకాన్ని తాత తమకు నేర్పించారని వివరించారు.
ఆ తర్వాత తన తండ్రి మరో లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. భారత్ ఏ విషయంలోనూ ఇతర దేశాల కంటే వెనుకబడకూడదనే సంకల్పంతో జామ్‌నగర్‌లోని నిరుపయోగ భూమిపై ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించారని పేర్కొన్నారు. భారత్ నిర్మాణ రంగంలో ముందడుగు వేస్తే ప్రపంచం దృష్టి సారిస్తుందని ఈ ప్రయాణం నిరూపించిందన్నారు. అనంతరం ప్రతి ఒక్కరి చేతిలో ఇంటర్నెట్ ఉండాలి, ప్రతి గ్రామానికీ ప్రపంచం అందుబాటులోకి రావాలనే కొత్త కల పుట్టిందని, అదే జియోగా రూపుదిద్దుకుందని చెప్పారు.
జియో ఆలోచనకు ఇషా దీదీ బీజం వేశారని, ఆకాశ్ భాయ్ దాన్ని తన కలగా మలుచుకున్నారని అనంత్ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలు జియోకు ఆశీస్సులు అందించారని అన్నారు. కరోనా సమయంలో పాఠశాలలు మూతపడినా చదువులు ఆగలేదని, వీడియో కాల్స్ ద్వారా దూరంగా ఉన్న తల్లులు తమ పిల్లలతో అనుబంధాన్ని కొనసాగించారని ఉదాహరణలు చెప్పారు.
చిన్న పట్టణంలో మొబైల్‌తో వీడియోలు చేయడం ప్రారంభించిన యువతి లక్షలాది మందికి చేరువై ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారడం, సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుడు వీడియో కాల్ ద్వారా కుటుంబానికి క్షేమంగా ఉన్నానని చెప్పడం, ముంబైలోని వైద్యుడు రాజస్థాన్‌లోని పాలి ప్రాంతంలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగికి చికిత్స అందించడం వంటి సందర్భాలను ప్రస్తావించారు. వీటన్నింటినీ అనుసంధానిస్తున్నది జియోనేనని చెప్పారు.
జియో ప్రత్యక్షంగా కనిపించకపోయినా భారతదేశంలోని ప్రతి డిజిటల్ కలలో భాగమైందని అనంత్ పేర్కొన్నారు. జియోపై నమ్మకం ఉంచిన 530 మిలియన్ల వినియోగదారులకు ముందుగా నమస్కరిస్తున్నామని తెలిపారు. జియోను నిర్మించింది వినియోగదారులేనని, వారి కలలను నిజం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
ఇషా, ఆకాశ్‌తో కలిసి తాము ముగ్గురిగా కనిపించినా ఒకే ఆత్మ, ఒకే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. తాత కల, నానమ్మ ఆశీస్సులు, తండ్రి మార్గదర్శకత్వం, తల్లి నేర్పిన వినయం, ఆప్యాయత తమకు పునాదులని వివరించారు. ఎండ, వానలను లెక్కచేయకుండా టవర్లపై పనిచేసిన సిబ్బంది, ఇంజినీర్లు, సేవా బృందాలు, దుకాణాల సిబ్బంది, రిటైల్ భాగస్వాములు, వారి కుటుంబాల సేవలను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు.

