ఆర్‌హెచ్‌ఆర్‌పీఎల్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.12.92 కోట్ల ఆదాయం నమోదు చేసింది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. అయితే ఈ కాలంలో నష్టాలు కూడా పెరిగాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.0.69 కోట్లుగా ఉన్న నష్టాలు 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.2.45 కోట్లకు చేరాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో ఫార్మసీ విభాగం ఆదాయానికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. ఈ వార్త ప్రచురించే సమయానికి డీమార్ట్‌కు మనీకంట్రోల్ పంపిన ఈమెయిల్‌కు సంస్థ నుంచి స్పందన రాలేదు.
ప్రస్తుతం డీమార్ట్‌కు దేశవ్యాప్తంగా 503 స్టోర్లు ఉన్నాయి. వీటి మొత్తం రిటైల్ ప్రదేశం సుమారు 20.7 మిలియన్ చదరపు అడుగులు. పరిశ్రమ వర్గాల ప్రకారం, డీమార్ట్ 20 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ విధానం వల్ల స్థానిక చిన్న మెడికల్ షాపులపై మార్జిన్ ఒత్తిడి పెరగొచ్చు. ఇప్పటికే లాభాలు సాధించేందుకు ఇబ్బంది పడుతున్న ఈ-ఫార్మసీలపై కూడా పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.
షాప్-ఇన్-షాప్ విధానంలో ముందడుగు
డీమార్ట్ ప్రత్యేకంగా కొత్త ఫార్మసీ దుకాణాలు ఏర్పాటు చేయడం కంటే, ఇప్పటికే ఉన్న స్టోర్లలోనే ఫార్మసీ కౌంటర్లను ఏర్పాటు చేసే “షాప్-ఇన్-షాప్” విధానాన్ని ఎంచుకుంది. ఎంఎంఆర్‌లోని కొన్ని డీమార్ట్ స్టోర్లలో కొద్దిపాటి మెడికల్ కౌంటర్లతో ఈ ప్రయోగం నిశ్శబ్దంగా కొనసాగుతోంది. మొదటి దశలో కస్టమర్ల నుంచి వచ్చిన స్పందన ప్రోత్సాహకరంగా ఉండటంతో, ఈ సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించే విషయాన్ని సంస్థ పరిశీలిస్తోంది. అయితే డీమార్ట్ సాధారణంగా నెమ్మదిగా, జాగ్రత్తగా విస్తరించే విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా విస్తరణ కూడా దశలవారీగా జరిగే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.
“భారీగా కస్టమర్లు వచ్చే డీమార్ట్ కిరాణా స్టోర్లలోనే ఫార్మసీలను ఏర్పాటు చేయడం వల్ల సంప్రదాయ ఫార్మసీలు, ఆన్‌లైన్ ఫార్మసీలు ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలు తగ్గుతాయి. అవి కస్టమర్లను సంపాదించేందుకు అయ్యే ఖర్చు (సీఏసీ), అదనపు రియల్ ఎస్టేట్ ఖర్చులు” అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పరిశ్రమ ప్రతినిధి తెలిపారు. భారత రిటైల్ మార్కెట్‌లో పోటీ పెరుగుతున్న సమయంలో డీమార్ట్ ఈ కొత్త అడుగు వేసింది. క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు సంప్రదాయ రిటైలర్లపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఎక్కువ లాభాలు ఇచ్చే, కస్టమర్లు తరచూ వచ్చే విభాగాలపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి.
ఓ దేశీయ బ్రోకరేజ్ సంస్థకు చెందిన విశ్లేషకుడు మాట్లాడుతూ, డీమార్ట్ నిర్వహణ లాభ మార్జిన్లు సాధారణంగా 7 నుంచి 8 శాతం మధ్య ఉంటే, ఫార్మసీ వ్యాపారంలో అవి 25 నుంచి 30 శాతం వరకు ఉండొచ్చని చెప్పారు. “ఫార్మసీ అనేది తరచూ కొనుగోలు చేసే, కస్టమర్లు ఎక్కువగా అనుసంధానమయ్యే విభాగం. బ్రాండెడ్ జనరిక్ మందుల్లో సాధారణంగా 25 నుంచి 30 శాతం వరకు స్థూల మార్జిన్లు ఉంటాయి. ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తుల్లో ఇవి ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. ఇప్పటికే ఉన్న స్టోర్ స్థలాన్ని ఉపయోగించుకోవడం వల్ల డీమార్ట్ 20 శాతం డిస్కౌంట్ ఇచ్చినా వ్యాపార పరంగా లాభదాయకంగా కొనసాగగలదు” అని ఆ విశ్లేషకుడు చెప్పారు.
ముందున్న సవాళ్లు
డీమార్ట్ ఫార్మసీ రంగంలోకి రావడాన్ని రిటైల్ పరిశ్రమ ఆసక్తిగా గమనిస్తోంది. అయితే కిరాణా వ్యాపారంలో పనిచేసిన విధానాన్ని ఆరోగ్య రంగంలో అమలు చేయడం అంత సులభం కాదని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫార్మసీ వ్యాపారంలో భారీ డిస్కౌంట్లు ఇవ్వడం దీర్ఘకాలంలో కొనసాగుతుందా అనే ప్రశ్నలు ఉన్నాయని థైరొకేర్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రాహుల్ గుహా తెలిపారు. ఆయన ఏపీఐ గ్రూప్‌లో ఆపరేషన్స్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. ఈ గ్రూప్ ఫార్మ్‌ఈజీని నిర్వహించడంతో పాటు ఔషధ పంపిణీ రంగంలో కూడా ఉంది. 20 శాతం మార్జిన్ తగ్గించడం వల్ల చిన్న చిన్న నిర్వహణ సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే అవకాశం తగ్గిపోతుందని రాహుల్ గుహా చెప్పారు.
ఫార్మసీ వ్యాపారం ఎక్కువ స్టాక్ అవసరమయ్యే రంగమని ఆయన వివరించారు. సాధారణ మెడికల్ షాప్ కూడా కస్టమర్లకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచేందుకు అనేక రకాల మందులను నిల్వ చేయాల్సి ఉంటుంది. ఒక సాధారణ ఫార్మసీ దుకాణం స్థానికంగా వచ్చే వివిధ రకాల ప్రిస్క్రిప్షన్ అవసరాలను తీర్చేందుకు ఎప్పుడైనా 4,000 నుంచి 5,000 వరకు స్టాక్ కీపింగ్ యూనిట్స్ (ఎస్‌కేయూలు) నిర్వహించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద స్థాయిలో నిల్వలను నిర్వహిస్తూ, అదే సమయంలో 20 శాతం డిస్కౌంట్ ఇవ్వడం దీర్ఘకాలంలో సాధ్యమవుతుందా అనేది ప్రశ్నగా ఉందని ఆయన చెప్పారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎఫ్‌ఎంసీజీ రంగానికి భిన్నంగా ఫార్మాస్యూటికల్ పరిశ్రమ చాలా విభజితంగా ఉంటుంది. అందువల్ల ఫార్మసీ చైన్‌లు 50 నుంచి 60 వరకు వేర్వేరు మందుల తయారీ కంపెనీలతో వ్యవహరించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే, డీమార్ట్ ఫార్మసీ రంగంలోకి ప్రవేశించడం వినియోగదారులకు తక్కువ ధరలకు మందులు అందించే అవకాశాన్ని తెచ్చిపెట్టవచ్చు. అయితే ఈ వ్యాపారాన్ని లాభదాయకంగా, దీర్ఘకాలం కొనసాగించడం కోసం స్టాక్ నిర్వహణ, సరఫరా వ్యవస్థ, డిస్కౌంట్ విధానం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి.
