Last Updated:
బెంగళూరులో ఓ మహిళ మృతదేహం మురుగునీటి కాలువలో కనిపించడంతో కలకలం రేగింది. మొదట ఆమె ఎవరో గుర్తించలేకపోయిన పోలీసులు.. ఇంటింటి తనిఖీలు, అదృశ్యమైన వారి ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు ఎలా గుర్తించారు?
కుటుంబ కలహాలు, అనుమానాలు ఓ మహిళ ప్రాణాలను బలిగొన్నాయి. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, మృతదేహాన్ని మురుగునీటి కాలువలో పడేసిన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. ఈ కేసులో నిందితుడైన 22 ఏళ్ల వలస కార్మికుడిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడిని మహమ్మద్ ఇర్ఫాజ్గా, మృతురాలిని అతడి భార్య రుక్సానాగా గుర్తించారు. వీరిద్దరూ బీహార్‌కు చెందినవారే.
పోలీసుల సమాచారం ప్రకారం.. ఇర్ఫాజ్, రుక్సానాలకు సుమారు ఏడాది క్రితం వివాహమైంది. రుక్సానాకు గతంలోనే మరో వ్యక్తితో పెళ్లి కాగా, ఆ వివాహం ద్వారా ఓ సంతానం ఉంది. బీహార్‌లో బెలూన్లు విక్రయించే సమయంలో ఇర్ఫాజ్, రుక్సానా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట ఉపాధి కోసం సుమారు ఆరు నెలల క్రితం బెంగళూరుకు వచ్చింది. అక్కడ ఓ వస్త్ర తయారీ కర్మాగారంలో ఇర్ఫాజ్ ఉద్యోగంలో చేరాడు.
అయితే, కొంతకాలంగా వీరి దాంపత్య జీవితంలో విభేదాలు పెరిగినట్లు పోలీసులు తెలిపారు. రుక్సానా తరచూ ఫోన్లో ఎవరో ఒకరితో మాట్లాడుతోందని ఇర్ఫాజ్ అనుమానించేవాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని విచారణలో వెల్లడైంది.
ఈ వివాదం అక్టోబర్ 10న తీవ్రరూపం దాల్చినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఆ రోజు ఇర్ఫాజ్ రుక్సానాపై రాయితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆమె నోటిలో గుడ్డను కుక్కినట్లు పోలీసులు తెలిపారు.
నేరాన్ని దాచిపెట్టేందుకు సమీపంలో నిలిపి ఉంచిన ఓ ద్విచక్ర వాహనం హ్యాండిల్ తాళాన్ని ఇర్ఫాజ్ బలవంతంగా విరిచినట్లు దర్యాప్తులో గుర్తించారు. రుక్సానా మృతదేహాన్ని ఓ సంచిలో పెట్టి, వాహనం హ్యాండిళ్ల మధ్య ఉంచాడు. అనంతరం ఆ వాహనాన్ని తోసుకుంటూ గోపాలపుర డ్రైనేజీ ప్రాంతానికి తీసుకెళ్లి, మృతదేహాన్ని మురుగునీటి కాలువలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అక్టోబర్ 13న ప్లాస్టిక్ కవరులో చుట్టి ఉన్న మహిళ మృతదేహాన్ని కాలువలో గుర్తించారు. తొలుత ఆమె వివరాలు తెలియకపోవడంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. పది కంటే ఎక్కువ బృందాలను ఏర్పాటు చేసి, ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. ఇటీవల నమోదైన అదృశ్యం ఫిర్యాదులను కూడా పరిశీలించారు.
గోపాలపురలో నివసించే ఓ మహిళ కొన్ని రోజులుగా కనిపించడం లేదని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఇర్ఫాజ్పై అనుమానం వచ్చి విచారించగా, నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
సోర్స్ : (ANI)

