Last Updated:
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఘోరం జరిగింది. దారుణ హత్యకు గురైన తల్లి మృతదేహంపై రెండేళ్ల పసిబిడ్డ ఏడుస్తూ కనిపించడం అందరినీ కలచివేసింది. వివాహేతర సంబంధమే ఈ దారుణానికి కారణమని పోలీసులు అనుమానిస్తూ భర్త, ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా సింధనూర్ తాలూకాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. స్నేహ (26) అనే వివాహిత దారుణ హత్యకు గురై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. అయితే ఆమె మృతదేహంపై రెండేళ్ల పసిబిడ్డ కూర్చుని అమ్మ కోసం గుండెలు పగిలేలా ఏడుస్తున్న దృశ్యం అక్కడున్న స్థానికులను, పోలీసులను తీవ్రంగా కలచివేసింది. సమాచారం అందుకున్న వెంటనే సింధనూర్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో మోది ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పసిబిడ్డను అనాథగా మార్చిన ఈ కిరాతక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎస్పీ అరుణాంశు గిరి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తును వేగవంతం చేశాయి.
ఈ హత్య కేసులో పోలీసులు ప్రధానంగా వివాహేతర సంబంధం కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. మృతురాలి భర్తతో పాటు ఆమె ప్రియుడిగా భావిస్తున్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివాహేతర సంబంధం వల్లే ఈ ఘోరం జరిగిందా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అనుమానితులను ప్రశ్నిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. త్వరలోనే అసలు హంతకులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, బెంగళూరులో మరో దారుణం వెలుగుచూసింది. కోటి రూపాయల కోసం ఓ 13 ఏళ్ల బాలుడిని దుండగులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. నిందితులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవ్వడంతో అందులో తనిఖీ చేసిన పోలీసులకు డిక్కీలో బాలుడి మృతదేహం లభించింది. దీంతో ఈ కిడ్నాప్ బాగోతం బయటపడింది.

