Last Updated:
స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో చాలా మంది తల్లులు బిడ్డకు పాలు ఇస్తూనే మొబైల్లో చాటింగ్ చేయడం, సోషల్ మీడియా చూడడం లేదా వీడియోలు చూడడం అలవాటుగా మార్చుకుంటున్నారు. ఈ అలవాటును నిపుణులు “బ్రెగ్జిటింగ్ (Brexting)” అని పిలుస్తున్నారు.
తల్లిపాలు అనేవి బిడ్డకు కేవలం ఆహారం మాత్రమే కాదు, తల్లి ప్రేమ, ఆప్యాయత, భద్రతను అందించే అమూల్యమైన బంధం కూడా. బిడ్డ పుట్టిన తర్వాత తొలి కొన్ని నెలల్లో తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లి, బిడ్డ మధ్య భావోద్వేగ అనుబంధం మరింత బలపడుతుంది. అయితే ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో చాలా మంది తల్లులు బిడ్డకు పాలు ఇస్తూనే మొబైల్లో చాటింగ్ చేయడం, సోషల్ మీడియా చూడడం లేదా వీడియోలు చూడడం అలవాటుగా మార్చుకుంటున్నారు. ఈ అలవాటును నిపుణులు “బ్రెగ్జిటింగ్ (Brexting)” అని పిలుస్తున్నారు. ఇది చిన్న విషయంలా కనిపించినా, బిడ్డ మానసిక, సామాజిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని గైనకాలజికల్ లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ఆకాంక్ష శ్రీవాస్తవ హెచ్చరిస్తున్నారు.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం, తల్లిపాలు ఇచ్చే సమయంలో తల్లి దృష్టి పూర్తిగా బిడ్డపైనే ఉండాలి. ఆ సమయంలో తల్లి కళ్లలోకి చూడటం, చిరునవ్వు చిందించడం, ప్రేమగా మాట్లాడటం, మెల్లగా తాకడం వంటి చిన్న చిన్న చర్యలు బిడ్డలో భద్రతా భావాన్ని పెంచుతాయి. ఇవే పిల్లల భావోద్వేగ వికాసానికి పునాది వేస్తాయి. కానీ తల్లి మొబైల్ స్క్రీన్‌లో నిమగ్నమై ఉంటే, బిడ్డకు ఆ ప్రేమపూర్వక అనుభూతి దూరమయ్యే అవకాశం ఉంటుంది.
నవజాత శిశువు మెదడు మొదటి కొన్ని నెలల్లో చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో తల్లి ముఖ కవళికలు, కళ్ల చూపులు, స్వరం, స్పర్శ వంటి వాటి ద్వారా బిడ్డ చాలా విషయాలను నేర్చుకుంటుంది. తల్లి తరచూ ఫోన్లో బిజీగా ఉంటే, బిడ్డతో కంటి కలయిక తగ్గుతుంది. దీంతో పిల్లల్లో భాషా అభివృద్ధి, సామాజిక నైపుణ్యాలు, ఇతరులతో మమేకమయ్యే సామర్థ్యం ప్రభావితమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు, తల్లి నుంచి తగినంత ప్రేమపూర్వక స్పందన అందకపోతే, కొంతమంది పిల్లల్లో చిరాకు, మొండితనం, ఆందోళన వంటి ప్రవర్తనా మార్పులు కనిపించవచ్చు. కొన్ని పరిశోధనల ప్రకారం, చిన్న వయసులో తల్లితో సరైన అనుబంధం లేకపోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి వంటి మానసిక సామర్థ్యాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే మొబైల్ ఫోన్‌ను బిడ్డకు చాలా దగ్గరగా ఉంచడం వల్ల వెలువడే విద్యుదయస్కాంత తరంగాల (Electromagnetic Radiation) ప్రభావంపై కూడా కొంతమంది నిపుణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ అంశంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ, అవసరం లేనప్పుడు ఫోన్‌ను బిడ్డకు దూరంగా ఉంచడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే తల్లిపాలు ఇస్తున్నప్పుడు కొన్ని సులభమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు. పాలు పట్టించే సమయంలో ఫోన్‌ను కనీసం ఐదు నుంచి ఆరు అడుగుల దూరంలో ఉంచండి. బిడ్డ కళ్లలోకి చూస్తూ ప్రేమగా మాట్లాడండి. చిన్న పాటలు పాడటం, మెల్లగా నిమరడం, చిరునవ్వుతో పలకరించడం వల్ల బిడ్డకు భద్రత, ఆనందం కలుగుతుంది. అలాగే టీవీ, మొబైల్ శబ్దం లేని ప్రశాంతమైన ప్రదేశంలో బిడ్డకు పాలు ఇవ్వడం మంచిది. ఒకవేళ ఫోన్ తప్పనిసరిగా దగ్గర ఉంచాల్సి వస్తే, సైలెంట్ లేదా ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టడం మంచిది.
తల్లి ఒడే బిడ్డకు తొలి ప్రపంచం. తల్లిపాలు ఇచ్చే ప్రతి క్షణం బిడ్డ శారీరక ఎదుగుదలతో పాటు భావోద్వేగ, మానసిక వికాసానికి కూడా ఎంతో విలువైనది. కాబట్టి ఆ అమూల్యమైన సమయాన్ని మొబైల్ స్క్రీన్లకు కాకుండా మీ చిన్నారికి కేటాయించండి. మీ ప్రేమ, మీ స్పర్శ, మీ కళ్లలోని ఆప్యాయతే బిడ్డకు జీవితాంతం నిలిచిపోయే గొప్ప బహుమతి.
Hyderabad,Telangana

