Last Updated:
ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఓ పబ్లిక్ వేడుకలో జంటగా కనిపించింది ఈ సెలబ్రిటీ జోడీ.
ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో, జాతీయ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వార్తలకు, ఊహాగానాలకు గట్టి కౌంటర్ ఇస్తూ ఈ జంట చాలా రోజుల తర్వాత పబ్లిక్ గా జంటగా కనిపించారు. ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా ముంబైలో ఘనంగా నిర్వహించిన దీపావళి వేడుకలకు (Diwali Bash) అభిషేక్, ఐశ్వర్యలు జంటగా హాజరై సందడి చేశారు.
ఈ గ్రాండ్ దీపావళి పార్టీలో ఈ స్టార్ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలో అభిషేక్ బచ్చన్ స్టైలిష్ నల్లటి కుర్తా ధరించి రాజసం ఉట్టిపడేలా కనిపించగా.. ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ముఖ్యంగా మీడియా కంటబడిన ఈ జంట, ఒకరిపై ఒకరు ఎనలేని ప్రేమను కురిపిస్తూ కెమెరాలకు ఫోజులివ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఫోటోలకు ఫోజులిస్తున్న సమయంలో ఐశ్వర్య ఎంతో ప్రేమగా భర్త అభిషేక్ వైపు చూస్తూ, ఆయన ఛాతీపై ఆప్యాయంగా తల వాల్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
#AishwaryaRai ❤️ at MM’s Diwali Party ✨ https://t.co/V66gCEowVF
— Balaji (@RDBalaji) November 6, 2026
Power Couple Goals! Aishwarya in Crimson Red & Abhishek in Sleek Black! ✨🔥
#AishwaryaRai #AbhishekBachchan https://t.co/XRn8H27ZQV— KollyFlix (@KollyFlix) November 6, 2026
గత కొంత కాలంగా ఈ స్టార్ కపుల్ వైవాహిక జీవితంలో మనస్పర్థలు వచ్చాయని, త్వరలోనే వీరు విడిపోనున్నారంటూ రకరకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అంబానీ ఇంట జరిగిన వివాహ వేడుకలతో పాటు పలు బహిరంగ కార్యక్రమాలకు ఇద్దరూ కలిసి హాజరుకాకపోవడంతో ఈ విడాకుల ప్రచారానికి మరింత బలం చేకూరింది. అయితే, గతంలోనే అభిషేక్ ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. అవన్నీ కేవలం అవాస్తవాలని కొట్టిపారేశారు. ఇప్పుడు తాజాగా పండుగ వేళ ఇద్దరూ ఇలా ఎంతో అన్యోన్యంగా కలిసి కనిపించడంతో వారి అనుబంధంపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడినట్లయింది.
అభిషేక్, ఐశ్వర్యల సినీ ప్రయాణం, ప్రేమ గురించి చూస్తే.. 1999లో వచ్చిన ‘ఢాయ్ అక్షర్ ప్రేమ్ కే’ సినిమా ఫొటోషూట్ సమయంలో వీరిద్దరి మధ్య తొలి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరు కలిసి ‘కుచ్ నా కహో’, ‘ఉమ్రావ్ జాన్’, ‘ధూమ్ 2’ వంటి చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ‘ఉమ్రావ్ జాన్’, ‘ధూమ్ 2’ సినిమాల షూటింగ్ సమయంలో వారి స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. ఇక 2007లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘గురు’ సినిమా ప్రమోషన్ల కోసం న్యూయార్క్ వెళ్లిన సమయంలో వీరు మరింత దగ్గరయ్యారు. అక్కడే ఐశ్వర్యకు అభిషేక్ ప్రపోజ్ చేశారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో అదే ఏడాది ఏప్రిల్ 20న ముంబయిలో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత 2011లో వీరికి కుమార్తె ఆరాధ్య బచ్చన్ జన్మించింది.

