Last Updated:
ఎయిర్ ఇండియా పైలట్ల డ్రగ్ టెస్టుల్లో ఇద్దరికి ‘నాన్-నెగెటివ్’ ఫలితాలు రావడంతో విమానయాన రంగంలో కీలక మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇకపై అన్ని ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే పైలట్లకు సైకోయాక్టివ్ సబ్‌స్టెన్స్ టెస్టులు తప్పనిసరి చేసే దిశగా డీజీసీఏ ఆలోచిస్తోంది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అన్ని ఎయిర్‌లైన్స్ తమ పైలట్లకు సైకోయాక్టివ్ సబ్‌స్టెన్స్ స్క్రీనింగ్ టెస్టులు చేయాలని కోరే అవకాశం ఉందని టైమ్స్ నౌ కథనం వెల్లడించింది. ఇందుకోసం సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్ (సీఏఆర్)లో మార్పులు చేసేందుకు విమానయాన నియంత్రణ సంస్థ పనిచేస్తున్నట్టు సమాచారం. డ్రగ్ టెస్టులు, ఇలాంటి స్క్రీనింగ్‌లకు సంబంధించిన నిబంధనలను కూడా మార్చే అవకాశం ఉంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే అన్ని ఎయిర్‌లైన్స్‌లో పైలట్లకు సైకోయాక్టివ్ సబ్‌స్టెన్స్ స్క్రీనింగ్ ఎలా నిర్వహించాలి, ఏ నిబంధనలు పాటించాలి అనే దానిపై స్పష్టమైన విధానం ఏర్పడుతుంది. ఈ పరిణామానికి కారణం ఎయిర్ ఇండియా గ్రూప్ తీసుకున్న తాజా నిర్ణయం. ఈ నెల ప్రారంభంలో ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానంలో జరిగిన ఘటన తర్వాత, ఎయిర్ ఇండియా గ్రూప్ తన పైలట్లందరికీ డ్రగ్ స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది.

