అంతర్జాతీయ మార్కెట్లలో కీలక పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు వరుసగా నాలుగో సెషన్లోనూ తగ్గాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్ కెవిన్ వార్ష్ జాక్సన్ హోల్ సింపోజియంలో ప్రసంగించనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణం, బాండ్ ఈల్డ్స్, భౌగోళిక రాజకీయ పరిణామాలు వంటి అంశాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మనీకంట్రోల్ వెల్లడించిన కథనం ప్రకారం.. దేశీయ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అక్టోబర్ డెలివరీకి సంబంధించిన బంగారం ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.856 లేదా 0.54 శాతం తగ్గి రూ.1,58,140 వద్దకు చేరింది. ఇదే సమయంలో డిసెంబర్ డెలివరీ కాంట్రాక్ట్ కూడా 10 గ్రాములకు రూ.942 లేదా 0.59 శాతం పడిపోయి రూ.1,59,450 వద్ద ట్రేడయింది.

